కరోనా నియంత్రణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని హైకోర్టుకు సమర్పించిన నివేదికలో ప్రభుత్వం వివరించింది. మార్చి 23తో పోలిస్తే కరోనా కేసులు దేశవ్యాప్తంగా 1,142 రెట్లు పెరగగా.. తెలంగాణలో 497 రెట్లు పెరిగాయని పేర్కొంది. రాష్ట్రంలో కరోనా పరీక్షలు జూన్ 29న 3,457 చేయగా... ఈనెల 25 నాటికి 15,654కి పెరిగాయని సర్కారు వివరించింది. పరీక్షల్లో కరోనా పాజిటివ్ శాతం 27.3 శాతం నుంచి 10.18శాతానికి తగ్గిందని వెల్లడించింది.
35,308 కేసులు
మాస్కులు, భౌతిక దూరం పాటించని వారిపై, నిబంధనలకు విరుద్ధంగా వివాహాలు, అంత్యక్రియలు, జనసమీకరణ చేసిన వారిపై పోలీసులు కేసులు నమోదు చేశారని నివేదికలో ప్రభుత్వం వివరించింది. మాస్కులు ధరించకుండా బహిరంగంగా తిరిగినందుకు రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 35,308 మందిపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు పేర్కొంది. భౌతిక దూరం నిబంధనలు ఉల్లంఘించినందుకు 1,211 కేసులు నమోదయ్యాయయని తెలిపింది.
కరోనా నిబంధనలను బేఖాతరు చేసి జన సమీకరణ చేసినందుకు రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు 82 కేసులు నమోదు చేసినట్లు సర్కారు వెల్లడించింది. కరోనా నిబంధనలను పట్టించుకోకుండా ఎక్కువ మందితో వివాహం జరిపినందుకు రాష్ట్రవ్యాప్తంగా 24 కేసులు నమోదు చేసి... 101 మందిని అరెస్టు చేసినట్లు తెలిపింది. అంత్యక్రియల్లో నిబంధనలకు మించి పాల్గొన్నందుకు హైదరాబాద్, రాచకొండ, రామగుండం, నిజమాబాద్, వికారాబాద్‌లలో ఆరు కేసులు నమోదు చేసి 27 మందిని అరెస్టు చేసినట్లు పేర్కొంది.