అవినీతి కేసుల్లో మూడు నెలలు, ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో ఆర్నెల్ల కాలంలో అనిశా విచారణ పూర్తి చేసి నివేదిక ప్రభుత్వానికి పంపాల్సి ఉంటుందని సుపరిపాలన వేదిక కార్యదర్శి ఎం.పద్మనాభరెడ్డి అందజేశారు. తెలిపారు. నివేదికపై ప్రభుత్వం 45 రోజుల్లో నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా సంబంధిత శాఖలకు చేరిన దస్త్రాలు ఏళ్ల తరబడి కార్యాలయాల్లో మగ్గిపోతున్నాయన్నారు.
తెలంగాణ గవర్నర్‌కు సుపరిపాలన వేదిక చేసిన ఫిర్యాదులో పేర్కొన్న కేసులు ఇవే..
- 2009 నవంబరులో రవాణాశాఖకు చెందిన ఓ అధికారి ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని అనిశా కేసు నమోదు చేసింది. అనంతరం ఆ అధికారి స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. అయినప్పటికీ ప్రభుత్వం విచారణకు అనిశాకు అనుమతి ఇవ్వలేదు. శాఖాపరమైన విచారణకు ఉత్తర్వు ఇవ్వగా అనిశా అభ్యంతరం తెలపడంతో 11 ఏళ్లుగా కేసులో ముందడుగు పడటంలేదు.
- 2010లో గిరిజనాభివృద్ధి సంస్థకు చెందిన ఓ అధికారి ఆదాయానికి మించిన ఆస్తుల కేసులోనూ విచారణకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో ఆరేళ్లుగా పెండింగ్‌లో ఉంది. పురపాలకశాఖకు చెందిన ఓ అధికారి అవినీతికి పాల్పడుతూ పట్టుబడగా.. ప్రభుత్వం శాఖాపరమైన విచారణకు అనుమతి ఇచ్చింది. చివరికి కేసును ప్రభుత్వం మూసివేసింది.
- 2015లో పరిశ్రమల శాఖకు చెందిన ఇద్దరు అధికారులు అనిశా వలకు చిక్కగా ఇప్పటికీ ఆ అధికారులను విచారణ చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు.
- 2016లో నీటిపారుదల శాఖలో నకిలీ ధ్రువపత్రాలతో పనులు చేసి నిధులు కాజేశారన్న ప్రచారంతో ప్రభుత్వం సీబీసీఐడీ విచారణకు ఆదేశించింది. మరో ఉత్తర్వుతో విచారణను నిలిపివేసింది. ఇప్పటికీ కేసు ముందుకు కదలలేదు.
- రెవెన్యూశాఖలో డిప్యూటీ తహసీల్దారుగా పనిచేస్తున్న ఓ అధికారిపై 2011లో అనిశా కేసు నమోదు చేసింది. సదరు అధికారిని విచారించేందుకు ప్రభుత్వాన్ని అనుమతి కోరగా... ఆరేళ్ల తర్వాత 2017లో ఆ కేసుపై తదుపరి చర్యలు నిలిపివేస్తూ ఆదేశాలిచ్చింది.
ఇదీ చదవండి: 'సీమ ఎత్తిపోతలపై కేంద్రమంత్రికి లేఖ రాయండి'