చంద్రబాబు పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 140 నియోజకవర్గాల్లో తెదేపా శ్రేణులు భోగిమంటల్లో రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులను తగులపెట్టారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టే జీవో 22, రైతు రుణమాఫీ 4,5విడతలు రద్దుచేస్తూ ఇచ్చిన జీవో 99, కౌలు రైతులకు సంబంధించిన జీవో 96, సున్నా వడ్డీ కుదింపు జీవో 464, రైతుల నిధులకు సంబంధించి ఇచ్చిన జీవో 417లను భోగిమంటల్లో వేశారు. ప్రజా వ్యతిరేక జీవోలను వెంటనే రద్దు చేయాలని, ధాన్యం కొనుగోళ్ల బకాయిలు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. 7 వరుస విపత్తుల్లో పంటనష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం చెల్లించక పోవడంపై నాయకులు మండిపడ్డారు. కనీస మద్దతు ధర రైతులకు హక్కుగా చట్టం చేయటంతో పాటు, వ్యవసాయ మార్కెట్ యార్డులను బలోపేతం చేయాలన్నారు.
కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం పరిటాలలో అధినేత చంద్రబాబు స్వయంగా పాల్గొని జీవోలను భోగి మంటల్లో వేసి దహనం చేశారు. శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్ నాయుడు, బొబ్బిలిలో మాజీ మంత్రి సుజయ కృష్ణ రంగారావు, పెద్దాపురంలో ఎమ్మెల్యే చినరాజప్ప, రాజమండ్రిలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి, తెనాలిలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, ఆనందబాబు, రాయదుర్గంలో మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు, పుట్టపర్తిలో పల్లె రఘునాధ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇదీచదవండి: భోగి మంటల్లో రైతు వ్యతిరేక జీవోలు.. చంద్రబాబు నిరసన