దిల్లీలో జరిగిన అఖిలపక్ష భేటీలో తెదేపా ఎంపీలు గల్లా జయదేవ్, కనమేడల రవీంద్ర కుమార్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో 29 బిల్లులు, 2 ఆర్థిక అంశాలపై చర్చ జరపాలని కేంద్రానికి ప్రతిపాదనలు పంపామన్నారు. కొవిడ్ పరిస్థితులు, ఎంపీ లాడ్స్పై చర్చ జరపాలని కోరామని కనకమేడల తెలిపారు. ప్రత్యేక హోదా, విభజన హామీలపై సైతం చర్చించాలని విజ్ఞప్తి చేశామన్నారు. సాగునీటి ప్రాజెక్టులపై అటు తెలంగాణను, ఇటు కేంద్రాన్ని ప్రశ్నించలేని స్థితిలో రాష్ట్రం ఉందన్నారు.
జీతాలు సైతం చెల్లించలేని స్థితిలో రాష్ట్రం..
రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉందని.. జీతాలు సైతం చెల్లించలేని స్థితిలో ఉందని కనకమేడల అన్నారు. దేవాలయాలపై దాడుల వ్యవహారంలో దర్యాప్తు, రాజద్రోహం 124ఏ సెక్షన్ దుర్వినియోగం వంటి అంశాలను అఖిలపక్ష సమావేశంలో ప్రస్తావించామన్నారు. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల, రైతు ఉద్యమం, పంటలకు మద్దతు ధరపై చర్చ జరపాలని కేంద్రాన్ని కోరామన్నారు. పార్లమెంట్ సమావేశాలకు తెదేపా సహకరిస్తుందన్నారు.
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాన్ని లెవనెత్తుతాం..
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాన్ని పార్లమెంట్లో లెవనెత్తుతామని కనకమేడల స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా, విభజన హామీలు, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలుపుదలకు అవసరమైతే తెదేపా ఎంపీలు రాజీనామాలు చేయటానికైనా సిద్ధంగా ఉన్నారని అన్నారు. వైకాపా ఎంపీలు రాజీనామాలు చేసి రాష్ట్రం కోసం పోరాడాలని సూచించారు.
ఇదీ చదవండి