తెలుగు భాషను విచ్ఛిన్నం చేసే కుట్రలో భాగంగానే.. తెలుగు అకాడమీ పేరు మార్చుతున్నారని తెదేపా నేత, రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ మండిపడ్డారు. ఆంధ్రుల క్షేమానికి, సంస్కృతికి తెలుగు భాషే పునాది అని ఆయన అన్నారు. ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయంతో.. తెలుగుభాష మనుగడకే ప్రమాదం ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
అకాడమీ పేరుమార్పు చర్య... భాషను అవమానించడమేనని ఆగ్రహానికి గురయ్యారు. మాతృభాషను నిర్లక్ష్యం చేయడం ఆత్మహత్యా సదృశ్యమేనని మండిపడ్డారు. పేరు మార్చితే తప్పేమిటని లక్ష్మీపార్వతి అనడాన్ని తప్పుబట్టారు. తెలుగుభాష అభివృద్ధికి పాటుపడాల్సిన వారు.. తెగులు పట్టించాలని చూడటం బాధాకరమన్నారు. తెలుగు పరిరక్షణకు భాషాభిమానులంతా నడుం బిగించాలని పిలుపునిచ్చారు. అకాడమీ పేరుమార్పు నిర్ణయాన్ని ప్రభుత్వం.. ఉపసంహరించుకోవాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: