Lokesh on Startups Rankings: కేంద్రం విడుదల చేసిన స్టార్టప్స్ ర్యాంకింగ్స్‌లో బిహార్‌తో పాటు ఆంధ్రప్రదేశ్ దిగువన ఉండటం దురదృష్టకరమని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ విచారం వ్యక్తం చేశారు. జగన్ రెడ్డి.. తన విధ్వంసక వైఖరితో అంకుర స్ఫూర్తిని నాశనం చేశారని ధ్వజమెత్తారు. అంకురాల ఏర్పాటుకు తెలుగుదేశం హయాంలో చేసిన కృషి వైకాపా హయాంలో ధ్వంసం అవుతుండటం బాధగా ఉందన్నారు. అంకురాల అభివృద్ధిలో 2018-19లో ఏపీ అగ్రగామిగా ఉందని గుర్తు చేశారు. కొత్త ఆలోచనలను ఫలవంతం చేసేందుకు బలమైన వేదికలను సన్‌రైజ్ ఇంక్యుబేషన్ హబ్, ఫిన్‌టెక్ వ్యాలీ లాంటి వ్యవస్థల ద్వారా ఏర్పాటు చేశామని తెలిపారు. వీటి ద్వారా అనేక స్టార్టప్‌లు తమ ప్రభుత్వ హయాంలో విజయవంతంగా ఏర్పడ్డాయని వెల్లడించారు.
Pattabhi on Startups Rank of AP: స్టార్టప్ ర్యాంకింగ్స్‌లో ఏపీని చివరి స్థానంలో నిలిపిన ఘనత ముఖ్యమంత్రి జగన్ రెడ్డిదేనని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ విమర్శించారు. తన పాలన అద్భుతమని చెప్పుకునే జగన్.. తాజా ర్యాంకింగ్స్‌పై ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. చంద్రబాబు పాలనలో ఏ ర్యాంకింగ్స్‌లో చూసినా ఏపీ టాప్‌లో ఉందన్నారు. 2014లో కేంద్ర ప్రభుత్వం కంటే ముందుగా చంద్రబాబు ఏపీ స్టార్టప్ పాలసీ తీసుకొచ్చారని గుర్తు చేశారు. చంద్రబాబు ప్రతి ఏడాది రూ. 13 వేల కోట్లపైన విదేశీ పెట్టుబడులు తీసుకొస్తే.. ఈ ముఖ్యమంత్రి ఏడాదికి కేవలం రూ. 1200 కోట్లు తేవడం సిగ్గుచేటు కాదా అని పట్టాభి ధ్వజమెత్తారు. జగన్ రెడ్డి జే ట్యాక్స్, కమీషన్ల దందా చూసి ఎవరైనా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వస్తారా అని ఎద్దేవా చేశారు.
ఇదీ చదవండి: