TDP leaders fires on YSRCP: రాష్ట్రంలో మహిళలు, దళితులపై దాడులు పెరుగుతున్నాయని.. తెదేపా నేతలు మండిపడ్డారు. సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్న వారిపై కేసులు పెట్టి వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.
తిరుగుబాటు తప్పదు: నారా లోకేష్
రాష్ట్రంలో ఉన్నది పోలీసులా, వైకాపా రౌడీషీటర్లకి అనుచరులా అనే అనుమానాలున్నాయని.. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. సోషల్ మీడియాలో ప్రశ్నించడమే నేరంగా.. శ్రీకాకుళంలో తెదేపా కార్యకర్త కోన వెంకటరావుని వేధించి బలవన్మరణానికి పాల్పడేలా చేసిన వైకాపా దుర్మార్గాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వ వైఫల్యాలు, వైకాపా అవినీతి, అక్రమాలపై.. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిని ఇలా చంపుకుంటూపోతే రాష్ట్రంలో వైకాపా నేతలు-పోలీసులు మాత్రమే మిగులుతారని విమర్శించారు. వెంకటరావు కుటుంబానికి తెదేపా అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. చట్టాలని గౌరవిస్తున్నామన్న లోకేశ్.. పోలీసుల్ని అడ్డుపెట్టుకుని అరాచకాలకి తెగబడితే.. తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు.
ప్రభుత్వం చేతకానితనం వల్లే రాష్ట్రంలో మహిళలపై దాడులు: బొండా ఉమా
వైకాపా ప్రభుత్వం చేతకానితనం వల్లే రాష్ట్రంలో మహిళలపై దాడులు పెరుగుతున్నాయని.. తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమా మండిపడ్డారు. మహిళల పరిస్థితి దినదిన గండంగా మారిందని, మహిళలపై దాడులు పెరుగుతున్నా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన చెందారు. నిత్యావసర ధరలు తగ్గించాలంటూ విజయవాడలో మహిళలు చేపట్టిన ధర్నాకు ఆయన సంఘీభావం తెలిపారు. నిత్యావసర సరకుల ధరలు ఆకాశన్నంటుతున్నా.. సీఎం జగన్ పట్టనట్టు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పన్నుల పేరుతో మధ్య తరగతి కుటుంబాల జీవితాలను అస్తవ్యస్తం చేస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం దోపిడీకీ పాల్పడుతోందని మండిపడ్డారు.
ఆయనకు కనీసం సంతాపం కూడా తెలపలేదు: అయ్యన్నపాత్రుడు
మాజీ సీఎం, మాజీ గవర్నర్గా పనిచేసిన కొణిజేటి రోశయ్యకి.. కనీసం సభలో సంతాపం తెలపడానికి కూడా ముఖ్యమంత్రి జగన్కు మనసు రాలేదా? అని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు. తన తండ్రికి అత్యంత ఆత్మీయుడిగా మెలిగిన రోశయ్య చనిపోతే.. నాడు నివాళికి జగన్ వెళ్లలేదని విమర్శించారు. నేడు కనీసం సభలో గౌరవంగా సంతాపం కూడా తెలుపలేదని మండిపడ్డారు. నాడు జగన్ నైజాన్ని, నిజ స్వరూపాన్ని ప్రపంచానికి తెలిపింది రోశయ్య అనే.. ఆయనకు ఇంత కక్ష అని వ్యాఖ్యానించారు. తన స్నేహితుడు గౌతమ్ రెడ్డికి సంతాపం తెలిపిన జగన్.. రోశయ్యకు మాత్రం సంతాపం తెలుపలేదని అన్నారు.
దళితులకు జరుగుతున్న అన్యాయం, మోసాలపై నోరు విప్పాలి: కె.జవహర్
జగన్రెడ్డి పాలనలో దళితులకు జరుగుతున్న అన్యాయం, మోసాలపై.. చట్టసభల్లో నోరు విప్పాలని మాజీ మంత్రి కె.జవహర్ డిమాండ్ చేశారు. జగన్ రెడ్డి పాలనలో దళితులు అడుగడుగునా అన్యాయానికి, అవమానానికి గురవుతున్నారని ఆరోపించారు. ఈ మేరకు ఆయన.. వైకాపా దళిత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు బహిరంగ లేఖ రాశారు. తెదేపా హయాంలో దళితులకు అమలు చేసిన సంక్షేమ పథకాలు నిలిపివేశారన్నారని అందులో పేర్కొన్నారు. సెంటు పట్టా పేరుతో వేలాది ఎకరాల దళితుల భూములు లాక్కున్నారని, సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లించారని ఆరోపించారు.
ఆ పథకాలన్నీ ఎందుకు నిలిపివేశారు: మహ్మద్ ఫతావుల్లా
జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ముస్లిం సమాజంలో చీకట్లే మిగిలాయని.. తెదేపా మైనారిటీ విభాగం రాష్ట్రప్రధాన కార్యదర్శి మహ్మద్ ఫతావుల్లా విమర్శించారు. ఉర్దూ భాషను రాష్ట్ర రెండో అధికార భాషగా చంద్రబాబునాయుడు ఎప్పుడో ప్రకటిస్తే, ఇప్పుడు జగన్మోహన్రెడ్డి డప్పుకొట్టుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. ముఖ్యమంత్రికి నిజంగా ముస్లింలపై, ఉర్దూపై ప్రేమాభిమానాలే ఉంటే.. తెదేపా ప్రభుత్వం మైనారిటీలకు అమలుచేసిన పథకాలు ఎందుకు ఆపేశారని నిలదీశారు.
ఇదీ చదవండి: Jagan Case: జగన్ అక్రమాస్తుల కేసు.. రఘురామ పిల్కు నెంబర్ కేటాయించాలని ఆదేశం