AYYANNA: పనులు ఆగిపోవడం వల్లే.. పోలవరం డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ వల్ల పనులకు బ్రేక్ పడుతుందని కేంద్ర హెచ్చరించిన విషయాన్ని మంత్రి అంబటి రాంబాబు తెలుసుకోవాలని సూచించారు. అయినప్పటికీ డబుల్ స్పీడ్‌తో తక్కువ రేటుకే నిర్మాణం పూర్తి చేస్తామని కేంద్రానికి జగన్ సర్కార్ నివేదిక ఇచ్చిందని అయ్యన్న గుర్తుచేశారు. పోలవరం హెడ్ వర్క్స్ పూర్తి చేయడానికి రివర్స్ టెండరింగ్ ద్వారా ఓ కంపెనీ 15 వందల 48 కోట్ల రూపాయలకే 24 నెలల్లో పూర్తి చేయడానికి ముందుకొచ్చిందంటూ రాష్ట్ర ప్రభుత్వం డప్పు కొట్టిందని ఎద్దేవా చేశారు. ఇప్పుడు ఆ వ్యయం 19 వందల17 కోట్ల రూపాయలకు పెరిగిందని ధ్వజమెత్తారు. 2019లో 14 లక్షల క్యూసెక్కుల వరద వచ్చిందని..., అప్పుడు కూడా డయాఫ్రమ్ వాల్ నిలబడిందని గుర్తుచేశారు. జగన్ రెడ్డి రివర్స్ టెండరింగ్ డ్రామాలతోనే డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరంలో ఏం కట్టాలి, ఎప్పుడు కట్టాలనేది పోలవరం అథారిటీ, కేంద్ర జల సంఘం అనుమతుల ప్రకారమే జరుగుతుందన్న విషయం అంబటి తెలుసుకోవాలని హితవు పలికారు. డయాఫ్రమ్ వాల్ కట్టడమంటే ఇళ్లు నిర్మించడం కాదని.. వాస్తవాలు తెలుసుకోవాలని సూచించారు.
దేవినేని ఉమామహేశ్వరరావు: పోలవరం ప్రాజెక్టు కట్టలేని వైకాపా నేతలు డయాఫ్రమ్ వాల్ మీద పడి ఏడుస్తున్నారని మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ధ్వజమెత్తారు. తెలంగాణ నాయకుడు వెదిరే శ్రీరామ్ పోలవరం సమీక్షించే పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు. దోపిడీ కోసమే కొత్త కొత్త రాగాలు అందుకుంటున్నారని దుయ్యబట్టారు. పోలవరం నిర్లక్ష్యం చేసి దేశద్రోహానికి పాల్పడ్డారని ఆగ్రహంవ్యక్తంచేశారు.
ఇవీ చదవండి:
- రాష్ట్రంలో అటకెక్కిన ఉచిత రేషన్ పంపిణీ... ఎప్పుడిస్తారనేదానిపైనా స్పష్టత కరవు
- ఇకపై మైనర్లకు వాహనాలిస్తే.. తల్లిదండ్రులకు జరిమానా..
- బ్లాక్‌డ్రెస్‌లో బేబీ బంప్‌తో సోనమ్ కపూర్.. ఫొటోలు వైరల్