TDP leaders fires on CM Jagan: వైఎస్ వివేకా హత్యకేసు విచారణను.. సీఎం జగన్ తప్పుదోవ పట్టిస్తున్నారని తెదేపా నేతలు ఆరోపిస్తున్నారు. కేసును తప్పుదోవ పట్టించేందుకు ముఖ్యమంత్రి విశ్వప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. కడప జిల్లా జమ్మలమడుగులోని పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో పలువురు తెదేపా నేతలు పాల్గొన్నారు.
సీఎం ఎందుకు మౌనం వహిస్తున్నారు: సోమిరెడ్డి
వైయస్ వివేకా హత్య కేసులో వాస్తవాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నా.. ముఖ్యమంత్రి జగన్ ఎందుకు మౌనం వహిస్తున్నారని తెదేపా నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రశ్నించారు. సీఎం జగన్ చిన్నాన్నను.. సొంత ఇంట్లోనే కిరాతకంగా హత్య చేస్తే, దానిని కప్పిపుచ్చేందుకు ప్రయత్నించారని ఆయన ఆరోపించారు. వివేకా హత్య కేసులో నిందితులు సీఎం కార్యాలయంలో ఉండటం ఏమిటని అనుమానం వ్యక్తం చేశారు. హత్య చేసిన వారిని వెనకేసుకువస్తే ప్రజలకు రక్షణగా ఎవరుంటారని నిలదీశారు. రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చేలా ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు.
అవినాష్ రెడ్డిని అప్పుడెందుకు సస్పెండ్ చేయలేదు: బీటెక్ రవి
వివేకా హత్యకేసులో జగన్‌ను అవినాష్‌రెడ్డి బ్లాక్‌మెయిల్ చేశారని తెదేపా నేత బీటెక్ రవి ఆరోపణలు చేశారు. హత్యకేసు సీబీఐకి ఇస్తే భాజపాలోకి వెళ్తానని అవినాష్‌రెడ్డి చెప్పారని.. ఆనాడే అవినాష్‌రెడ్డిని ఎందుకు సస్పెండ్ చేయలేదని నిలదీశారు. సీబీఐ విచారణ జరిపించాలని జగన్ వద్దకు సునీత వెళ్తే.. కేసు ఉపసంహరించుకోకపోతే తన భర్తపైనే కేసు పెడతామని బెదిరించలేదా? అని ప్రశ్నించారు.
కేసును తప్పుదోవ పట్టించేందుకు సీఎం ప్రయత్నాలు: చినరాజప్ప
సునీత వెనుక చంద్రబాబు ఉన్నారన్న సజ్జల వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు.. తెదేపా నేత నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. సీబీఐ విచారణలో అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి పేర్లు బయటకొచ్చాయన్న ఆయన.. హత్య కేసును పక్కదారి పట్టించడానికే సజ్జల వ్యాఖ్యలు చేశారని అన్నారు. కేసును తప్పుదోవ పట్టించేందుకు జగన్ విశ్వప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.
ముఖ్యమంత్రిని అరెస్టు చేయాలి: గోరంట్ల
వైఎస్ వివేకా హత్యకేసు విచారణను ముఖ్యమంత్రి జగన్ తప్పుదోవ పట్టిస్తున్నారని.. తెదేపా ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆరోపించారు. వెంటనే ముఖ్యమంత్రిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ సకుటుంబ సపరివార సమేతంగా చేసిన ఈ హత్య కుట్రను.. పూర్తిగా వెలికితీసేందుకు సీబీఐ తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
నిందితులు నీకు రెండు కళ్లా..?
వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో.. అవినాష్ రెడ్డి కుటుంబాన్ని అరెస్టు చేసి, సీఎం జగన్ పై చర్యలు తీసుకోవాలని కడప పార్లమెంటు తెదేపా అధ్యక్షుడు మల్లెల లింగారెడ్డి డిమాండ్ చేశారు. మీ చిన్నాన్న హత్య కేసులోని నిందితులు నీకు రెండు కళ్లా..? అని ముఖ్యమంత్రిని ప్రశ్నించారు.
వివేకా కేసులో దోషులెవరో సీబీఐకి అర్థమైంది: యనమల
TDP Leader Yanamala on Viveka Murder case: వివేకా హత్య కేసులో దోషులెవరనేది సీబీఐకి అర్థమైందని తెదేపా నేత యనమల రామకృష్ణుడు అన్నారు. వివేకా కేసు విచారణ చేస్తున్న సీబీఐ అధికారులపై జగన్ ఎదురుదాడి చేస్తున్నారని ఆరోపించారు. తాత దగ్గర రౌడీ రాజకీయం నేర్చుకున్న వ్యక్తి జగన్ అని యనమల ఘాటుగా విమర్శించారు. ఓటీఎస్ విధానంతో పేద ప్రజల సొమ్మును బినామీల పేర్లతో జగన్ దోచుకుంటున్నాడని యనమల దుయ్యబట్టారు.
రాష్ట్రంలోని ఇసుక, మట్టిని నామ రూపాలు లేకుండా చేసిన వ్యక్తి జగన్ అని విమర్శించారు. రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ దారుణంగా దెబ్బతిందన్న ఆయన.. నాయకుల చరిత్ర చూడకుండా ఓటేస్తే ఇలాంటి దుస్థితే వస్తుందని ఆక్షేపించారు. వైకాపా ప్రభుత్వం రైతుల పట్ల వ్యవహరిస్తున్న తీరుపై తెదేపా సీనియర్ నేత జ్యోతుల నెహ్రూ మండిపడ్డారు.
ఇదీ చదవండి:
ఉక్రెయిన్‌లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులను తీసుకురావాలి - కనకమేడల