TDP YANAMALA: జగన్ ప్రభుత్వం దిగిపోయే నాటికి బడ్జెటేతర అప్పులతో కలిపి రాష్ట్ర అప్పులు రూ.10లక్షల కోట్లకు చేరుతాయని తెదేపా నేత యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. బడ్జెట్ అంచనాలు, మొత్తం వ్యయంలో అభివృద్ధి నత్తనడకన ఉంటే.. చెల్లింపులు మాత్రం చాంతాడంత కానుందన్నారు. అప్పులపై కేంద్రం ఇంకెన్నాళ్లు రాష్ట్రాన్ని హెచ్చరిస్తుందని నిలదీశారు. జగన్ మళ్లీ అధికారంలోకి రాలేనని.. రాష్ట్రాన్ని భవిష్యత్తులో కూడా తిరిగి కోలుకోలేని దెబ్బ తీయాలని చూస్తున్నారని మండిపడ్డారు.
జగన్ అవినీతి, అక్రమ సంపాదనలను వెలికితీసే పనిపై కేంద్రం దృష్టి పెట్టాలని కోరారు. జగన్ సృష్టించిన ఆర్థిక సంక్షోభం, వ్యవస్థల విధ్వంసం కారణంగా ఆంధ్రప్రదేశ్ సరిదిద్దుకోలేని అప్పుల ఊబిలోకి కూరుకుపోయిందని దుయ్యబట్టారు. ఏపీలో ఆర్థిక అత్యవసర పరిస్థితి విధింపు మినహా.. కేంద్రానికి మరో మార్గం లేని పరిస్థితి ఏర్పడిందన్నారు. లెక్కలేని అప్పులు అగ్నికి ఆజ్యం అయ్యాయని.. దానికితోడు ఇటీవలి మంత్రిమండలి మార్పు వైకాపా కొంపలో కుంపటి అయ్యిందన్నారు.
శ్రీలంక దేశాధ్యక్షుడు కూడా జగన్ మాదిరిగానే తన వైఫల్యాలను కప్పిపెట్టి, నిత్యావసరాల ధరలు ఆకాశానికి అంటించారని మండిపడ్డారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పతనం అంచుల్లో ఉందని.. జగన్ పాలనతో ప్రజలంతా విసిగిపోయారన్నారు. సంక్షేమ పథకాల అమలు కన్నా వాటి యాడ్స్కే ప్రాధాన్యత ఇస్తున్నారని విమర్శించారు.
ఇవీ చదవండి: