ముఖ్యమంత్రి జగన్ దిల్లీ పర్యటనలో హోంమంత్రి అమిత్ షాతో 3 రాజధానుల అంశంపై కాకుండా ఇతర అంశాలపై గంట 32 నిమిషాల పాటు రహస్యంగా సమావేశమయ్యారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఆరోపించారు. "బెయిల్ రద్దు, సీబీఐ పులివెందులలో ఉండటం, ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యవహారం వంటి గడ్డు పరిస్థితులు జగన్ ఎదుర్కొంటున్నారు. జగన్ని ఆశ్చర్యపరిచేలా బాబాయ్ హత్య కేసులో సీబీఐ ఒక ప్రముఖ వ్యక్తిని త్వరలో అరెస్టు చేయనుంది. ఎంపీ రఘురామకృష్ణ రాజుపై ప్రయోగించిన థర్డ్ డిగ్రీ వ్యవహారంలో జగన్ రెడ్డి భంగపాటుకు గురైనందున సర్దుబాటు చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. 11 సీబీఐ కేసుల్లో బెయిల్ రద్దు కాకుండా చూడాలని వేడుకున్నారా ? లేక బాబాయ్ హత్య కేసులో జగన్ అనుకున్న వ్యక్తి అరెస్టు కాకుండా చూడాలని కోరారా ? లేక రఘురామకృష్ణం రాజు వ్యవహారంలో పరువు కాపాడమని బతిమాలారా ?" అని వర్ల ప్రశ్నించారు.
3 రాజధానుల అంశం కోర్టు పరిధిలో ఉన్నందున దానిపై హోంమంత్రితో అంతసేపు చర్చించలేరని వెల్లడించారు. సీబీఐ హోంమంత్రిత్వ శాఖ నియంత్రణలో ఉన్నందున జగన్ ఆ మూడు అంశాలపైనే అమిత్ షాతో సమావేశమయ్యారన్నారు.
ఇదీచదవండి