వైకాపా రెండేళ్ల పాలనంతా.. తప్పులు, అప్పులు, ప్రజలకు తిప్పలు అన్నట్లుగా ఉందని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు కళా వెంకట్రావు ధ్వజమెత్తారు. తెచ్చిన అప్పులతో.. దుబారా ఖర్చులు చేసి.. సంక్షేమ పథకాల కోసం అప్పులు తెచ్చామని అబద్దాలు చెప్పి ప్రజలను మోసం చేయటం సిగ్గుచేటని దుయ్యబట్టారు. అమెరికాను కొలంబస్ కనుగొన్నట్లు సంక్షేమాన్ని వైకాపా నేతలే కనుగొన్నట్టుగా ప్రచారం చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వాలు సంక్షేమ పథకాలను అమలు చేయనేలేదా.. అని నిలదీశారు.
రాష్ట్ర రుణాలు జీఎస్‌డీపీలో 4 శాతానికి మించకూడదన్న ఆర్థిక సంఘం నిబంధనలను ఉల్లంఘించి మరీ జగన్ ప్రభుత్వం అప్పులు చేస్తోందని కళా వెంకట్రావు మండిపడ్డారు. తెదేపా ప్రభుత్వ హయాంలో 60 నెలల్లో రూ. 1,30,146.98 కోట్లు అప్పు చేస్తే.. వైకాపా ప్రభుత్వం 25 నెలల్లోనే రూ. 1,49,212.11 కోట్లు అప్పులు చేసిందని లెక్కలతో సహా వివరించారు. దేశంలో అధికంగా అప్పులు చేస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీనే అని తెలిపారు.
ఉద్యోగులకు సకాలంలో జీతాలివ్వకుండా వారి కుటుంబాల్ని పస్తులు ఉంచుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల్లో చాలామంది నెల జీతాల కోసం ఎదురు చూస్తున్నారని.. పింఛన్‌దారులు సైతం పూర్తి పెన్షన్ కోసం నిరీక్షిస్తున్నారని పేర్కొన్నారు. సీఎం జగన్.. రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీయించారని మండిపడ్డారు.
ఇదీ చదవండి:
VIVEKA MURDER CASE: వివేకా హత్యకు వాడిన ఆయుధాల కోసం అన్వేషణ.. దక్కని ఫలితం