కేంద్రం విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు సిద్ధమవుతున్నా.. రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి కనీసం స్పందన లేదని తెదేపా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. సీఎం జగన్ తన జేబులు నింపుకోవటం కోసం.. స్టీల్ ప్లాంట్ను ఫోక్సో కంపెనీకి కట్టబెట్టి జాతికి ద్రోహం చేస్తున్నారని ఆరోపించారు. ఫోక్సో ఒప్పందాలు బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.
కేంద్రం ప్రైవేటీకరణ నిర్ణయం తీసుకున్న తర్వాత.. రాష్ట్ర ప్రభుత్వం జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాలను ఎందుకు బయటపెట్టట్లేదని అచ్చెన్నాయుడు నిలదీశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు చీకటి ఒప్పందాలు చేసుకుంటూ.. మోసపూరిత ప్రకటనలు చేస్తున్న నేతలకు బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉందని అన్నారు. విశాఖ ఉక్కుపై ఆధారపడిన లక్షలాది మంది 150 రోజులుగా చేస్తున్న ఉద్యమం ముఖ్యమంత్రికి కనిపించట్లేదా అంటూ ప్రశ్నించారు.
గతేడాదికంటే 126 శాతం ఎక్కువ టర్నోవర్ సాధించిన పరిశ్రమను అమ్మేస్తుంటే.. ప్రభుత్వం ఎందుకు మౌనం వహిస్తోందని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి పదవి చేపట్టిన నాటి నుంచి రాష్ట్ర ఆస్తులు అమ్మేందుకే జగన్మోహన్ రెడ్డి ప్రాధాన్యం చూపుతున్నారన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసుల భయంతో కేంద్రానికి ప్రేమలేఖలు ఆపి ఎదురు తిరగాలన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమల ప్రైవేటు పరమైతే తెలుగు జాతి ప్రాణం పోయినట్లేనన్న విషయాన్ని సీఎం గుర్తించాలని అచ్చెన్నాయుడు హితవుపలికారు.
ఇవీ చదవండి:
బకాయిలు ఇవ్వకుండా ప్రకటనలు ఇస్తే రైతుల కడుపు నిండదు: చంద్రబాబు