వైకాపా పాలనలో మహిళలకు జరిగిన అన్యాయాలను సాక్ష్యాధారాలతో నిరూపించడానికి బహిరంగ చర్చకు సిద్ధమని తెదేపా మహిళా నేత వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్కు బహిరంగ లేఖ రాశారు. జగన్ రెండేళ్ల పాలనలో మహిళలకు జరిగిన న్యాయం ఒక్కటైనా ఉందా ? అని ప్రశ్నించారు. తెదేపా ప్రభుత్వంలో మహిళలు తలెత్తుకొని బతికితే..వైకాపా పాలనలో ఇంటికే పరిమితయ్యారని దుయ్యబట్టారు. సంపూర్ణ మద్యపాన నిషేధమంటే వైకాపాను నమ్మి మహిళలు ఓట్లేశారన్నారు. ప్రభుత్వం మాత్రం మద్యాన్ని ఏరులై పారించడమే కాక నాసిరకం మద్యాన్ని విక్రయిస్తూ..సామాన్యుల ప్రాణాలతో చెలగాటమాడుతోందని మండిపడ్డారు. అమ్మఒడి పేరుతో రూ.4 వేలు ఇచ్చి.. నాన్న బుడ్డితో రూ.36 వేలు లాక్కుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
45 ఏళ్లు నిండిన మహిళలకు పింఛన్ ఇస్తానని హామీ ఇచ్చి నట్టేట ముంచారన్నారు. దిశ చట్టం ఆమోదించిన రోజే గుంటూరులో ఐదేళ్ల బాలికపై వైకాపాకు చెందిన లక్ష్మణరెడ్డి అనే వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. ఆడపడుచులకు ఇంతటి క్షోభను మిగిల్చిన వైకాపాకు మహిళా దినోత్సవ వేడుకలు జరుపుకునే హక్కు లేదన్నారు.
ఇదీచదవండి