గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలోని పసుమర్రు, లింగారావుపాలెం గ్రామాల్లో స్వామివార్ల పార్వేట తెప్పోత్సవ కార్యక్రమాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. ప్రతి ఏటా సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని మూడువ రోజులపాటు నిర్వహించే ఈ కార్యక్రమం చివరి రోజు పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. ముందుగా స్వామివార్లను ఆయా గ్రామాలలో పెద్ద ఎత్తున ఊరేగించారు. భక్తులతో సందడి వాతావరణం నెలకొంది.
ప్రకాశం జిల్లా....
అద్దంకి మండలం సింగరకొండలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి వార్ల తెప్పోత్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా స్వామివారిని ఊరేగించారు. అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హంస వాహనం మీద విద్యుత్ వెలుగుల మధ్య స్వామివారిని ఆశీనులు చేశారు. అంతకుమందు ఆలయ సహాయ కమిషనర్ ఎన్.శ్రీనివాసరెడ్డి, వేద పండితులు హరి శంకర అవధాని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అద్దంకి వైకాపా ఇన్చార్జీ బాచిన కృష్ణ చైతన్య దంపతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మేళతాళాల మధ్య సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అద్దంకి పోలీసు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
కనుమ పండుగా సందర్భంగా సమస్త లోక రక్షణ కోసం నిర్వహించే పార్వేట ఉత్సవం ఒంగోలు పట్టణం గద్దలగుంట సమీపంలో అంగరంగ వైభవంగా జరిగింది. వివిధ రకాల వేషధారణలో దేవుళ్లు దర్శనమిచ్చారు. ఈ ఉత్సవంలో భక్తులు పోటెత్తారు.
నెల్లూరు జిల్లాలో...
వెంకటగిరి కుమ్మరగుంట పుష్కరిణిలో 31వ వార్షిక సాయిబాబా తెప్పోత్సవం ఘనంగా జరిగింది. ప్రతి ఏటా కనుమ పండుగ రోజున రాత్రిపూట నిర్వహించే ఈ వేడుకలను కొవిడ్ నిబంధనల మేరకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సింహ వాహనం మీద బాబా తెప్పోత్సవం సాగింది. ప్రముఖ ఆధ్యాత్మిక ఉపన్యాసకులు చింతపట్ల సాయిబాబా.. ఉపన్యాసం భక్తులను ఆకట్టుకుంది.
నెల్లూరులో భ్రమరాంబా సమేత మల్లేశ్వర స్వామి తెప్పపై విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. అయితే ఈసారి కరోనా కారణంగా ఉత్సవమూర్తులను కొలువుదీర్చకపోవడంతో పార్వేట ఉత్సవం వెలవెలబోయింది. రంగనాథస్వామి, వేణుగోపాలస్వామి, మూలస్థానేశ్వర స్వామి, సీతారాములు మాత్రమే భక్తులకు దర్శనమిచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు తెప్పోత్సవాన్ని తిలకించారు.
శ్రీకాకుళం జిల్లాలో ..
నరసన్నపేటలో పార్వేట ఉత్సవం ఘనంగా జరిగింది. నరసన్నపేట వెంకటేశ్వర ఆలయం ఉత్సవమూర్తులను సంతతోటలోని మండపం వద్దకు తిరువీధిగా తీసుకువచ్చి పార్వేట ఉత్సవాన్ని నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. వేద పండితులు రేజేటి శ్రీరామచార్యులు, మాధవాచార్యులు ,అనంత రామమూర్తి తదితరులు పార్వేట ఉత్సవంలో పాల్గొన్నారు.
కర్నూలు జిల్లాలో...
అహోబిలంలో వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి మాత్రం తానే స్వయంగా భక్తుల వద్దకు వెళ్లి తన దర్శన భాగ్యం కలిగించి వారికి ఆశీర్వాదాలు అందిస్తారు. ఈ అరుదైన ఘట్టాన్ని పార్వేట ఉత్సవాల పేరిట నిర్వహిస్తారు. అహోబిల లక్ష్మీ నరసింహ స్వామి పార్వేట ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. దిగువ అహోబిలంలో శ్రీ ప్రహ్లాద వరద స్వామి, శ్రీ జ్వాల నరసింహ మూర్తి ఉత్సవమూర్తులను ఉంచి ప్రత్యేక పూజలు చేశారు.
41 రోజులపాటు వివిధ గ్రామాలలో పర్యటించి స్వాములవారు భక్తులకు దర్శనభాగ్యం కలిగిస్తారు. ఈ మహోత్సవ ప్రారంభోత్సవంలో అన్నకూటోత్సవం జరిగింది. ఓకే పల్లకిలో ఇద్దరు స్వాములవార్లు కొలువై గ్రామాలకు పార్వేట ఉత్సవం పేరిట పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు
ఇదీ చూడండి: