Ramayana Story: చాలా మంది చిన్నప్పటి నుంచి రామనామాన్ని జపిస్తుంటారు. కానీ ఇక్కడ ఉన్న చిన్నారి మాత్రం బియ్యపు గింజలపై రామయాణాన్ని లిఖించింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడు కాండముల్లోని ముఖ్యమైన ఘట్టాలను లిఖించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అయోధ్యలో నిర్మితమవుతున్న భవ్య రామమందిరానికి తనవంతు కానుకగా పంపాలని భావిస్తోంది. సూక్ష్మచిత్రలేఖనంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని అందరి ప్రశంసలు అందుకుంటోంది.
విజయవాడ పాతబస్తీకి చెందిన విద్యార్ధిని పద్మావతి తొమ్మిదో తరగతి చదువుతూనే తన ప్రత్యేకతను చాటుకుంటోంది. పదో ఏటే బియ్యపు గింజల మీద పేర్లు రాసే నైపుణ్యం సాధించిన ఈ చిన్నారి... తన ఇష్టదైవం రాముడి కథ బియ్యపు గింజల మీద రాయాలని సంకల్పించింది. అనుకున్నదే తడవుగా పని ప్రారంభించి సుమారు 2 వేల బియ్యం గింజల మీద రామాయణ కథ రాసి తన భక్తిని చాటుకుంది.
రామాయణంలోని ఏడు కండాల సారాంశాన్ని చిన్నచిన్న వాక్యాలుగా చేసి ఒక్కో గింజ మీద సుమారు 20 అక్షరాల వరకు రాస్తూ మొత్తం రామాయణాన్ని పూర్తి చేసింది. అంతేకాదు 22 భాషల్లో శ్రీరామ అని రాసి రాముడి పాదాలకు కానుకగా అంకితం చేసింది. తాను రాసిన రామాయణాన్ని, రామనామాన్ని అందంగా ఫ్రేమ్ కట్టి, కలకాలం ఉండేలా భద్రపరిచింది. ఎంతో కష్టపడి సూక్ష్మకళలో ప్రావీణ్యం పొందిన పద్మావతికి తల్లిదండ్రులు శ్రీనివాస్ , సువర్ణలక్ష్మి మరింత రాణించేందుకు సహకరించారు.
భగవద్గీత పోటీల్లో జాతీయస్థాయి బహుమతులు అందుకున్న పద్మావతి.. సూక్ష్మచిత్రలేఖనంతో పాటు కూచిపూడి నృత్యంలోనూ అంచెలంచెలుగా ఎదుగుతోంది.
ఇదీ చదవండి: Exams: పది ప్రీఫైనల్ పరీక్షకు ఎనిమిదో తరగతి ప్రశ్నపత్రాలు..!