Somu Fire On YSRCP Govt: చంద్రబాబు ఐదేళ్లలో రాజధాని నిర్మించలేకపోయారని.., నేను కడతానని వచ్చిన జగన్ రాజధానే లేకుండా చేశారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఎద్దేవా చేశారు. తెదేపా, వైకాపాలు రాజధాని విషయంలో ప్రజలను అయోమయంలోకి నెట్టారన్నారు. రాష్ట్రాన్ని పాలించిన గత, ప్రస్తుత పాలకులు అంచనాలు వేయటంలో విఫలమయ్యారన్నారు. రాష్ట్ర ఆర్థిక ప్రగతిని సరైన మార్గంలో తీసుకెళ్లలేక పోయారని మండిపడ్డారు. నిర్మాణాత్మకమైన ఆలోచనలు చేయకపోవటం వల్లే రాష్ట్ర అభివృద్ధి ఆగిపోయిందని సోము వీర్రాజు ఆక్షేపించారు. కేంద్ర బడ్జెట్‌పై విజయవాడలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన విశ్లేషణాత్మక సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
విభజన తర్వాత రాష్ట్రానికి దిశ, దశ లేకుండా పోయిందన్నారు. 13 జిల్లాల్లో ఉన్న వనరులు, సముద్ర తీర ప్రాంతాలను వినియోగించుకుంటే రాష్ట్ర అభివృద్ధి పరుగులు పెడుతుందన్నారు. ఏపీలో రహదారుల అభివృద్ధికి కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ రూ.3 లక్షల కోట్లు ఖర్చు పెట్టేందుకు సిద్ధమని ఇప్పటికే ప్రకటించినట్లు తెలిపారు. కేంద్రం ద్వారానే రాష్ట్ర అభివృద్ధి కల సాకారమవుతుందని తెలిపారు. రాష్ట్రంలో పరిస్థితిని ప్రక్షాళన చేయాలని.., అది ఒక్క మోదీ సారథ్యంలోని భాజపాకే సాధ్యమని సోము వీర్రాజు అన్నారు. ఈ విషయంపై ప్రజలు కూడా ఆలోచిన చేసి కుటుంబ పాలకులకు బుద్ధి చెప్పాలని సూచించారు.
ఆ విధానానికి చరమగీతం పాడాలి..
భారీగా అప్పులు చేసి ప్రజలకు పంచుతామనే విధానానికి రాజకీయ పార్టీలు చరమగీతం పాడాలని.., ఇందుకు ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకోవటం ఆవశ్యకమని మాజీ సీఎస్, భాజపా సీనియర్ నేత ఐవైఆర్ కృష్ణారావు అన్నారు. రాష్ట్ర అనుభవాలను దృష్టిలో ఉంచుకుని దేశవ్యాప్తంగా బడ్జెట్ ఎన్నికల మేనిఫెస్టోను రాజకీయ పార్టీలు ప్రవేశపెట్టేలా చేయాలని పేర్కొన్నారు. ఈ విషయమై సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజనవాజ్యం దాఖలైందని.. సానుకూల ఆదేశాలు వస్తాయనే ఆశాభావంతో ఉన్నట్లు చెప్పారు. అప్పుడే విచ్చలవిడితనాన్ని కట్టడి చేయగలమని సమావేశంలో పాల్గొన్న ఆయన అభిప్రాయపడ్డారు. బడ్జెట్ ఎలా రూపొందించాలి అనే దానికి కేంద్ర ప్రభుత్వ తాజా బడ్జెట్ ఓ ఉదాహరణగా పేర్కొన్నారు. అత్యంత అధ్వాన్న బడ్జెట్ రూపకల్పనలో ఆంధ్రప్రదేశ్ ముందుందని విమర్శించారు. ఆదాయ, వ్యయాలు, ఖర్చులను బేరీజు వేసుకోకుండా నీళ్లమీద నడిస్తే అగాధంలోకి వెళ్లడం ఖాయమన్నారు.
కేంద్రంపై నిందలు వేసేందుకు ప్రయత్నం..
ప్రాంతీయ పార్టీలు తమ వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకు కుట్రలు చేస్తున్నాయని రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు. కేంద్రంపై నిందలు వేసి తప్పుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాయని.. రాష్ట్ర విభజన అనంతరం నష్టపోయిన రాష్ట్రాన్ని అన్ని విధాలా ఆదుకునేందుకు ప్రధాని మోదీ ఎన్నో నిధులు మంజూరు చేశారని వివరించారు. 2015-16లో రూ.27,990 కోట్లు మంజూరు చేస్తే.. 2020-21లో మూడు రెట్లు అదనంగా రూ.77,538 కోట్లు విడుదల చేసినట్లు గణాంకాలతో పేర్కొన్నారు.
ఇదీ చదవండి
Contempt of Court: కోర్టు దిక్కరణ కేసులో తహసీల్దార్‌కు జైలు శిక్ష