రాష్ట్ర ప్రభుత్వం కనీసం రూ.రెండు వేల కోట్ల వ్యయంతో ప్రతిపాదించిన రహదారుల నిర్మాణాలను సైతం చేపట్టలేని స్థితిలో ఉందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు(BJP state president Somu veeraju) విమర్శించారు. రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వేల కోట్ల రూపాయల జాతీయ రహదారులు, గ్రామాల్లో సడక్ యోజన పథకం కింద లింకు రోడ్ల నిర్మాణాలు చేపడుతోందన్నారు. దీనిపై బహిరంగ చర్చకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమేనా అని సవాల్ విసిరారు. త్వరలో మీడియా సమక్షంలో తాము కేంద్రం నిధులతో రాష్ట్రంలో రహదారుల నిర్మాణం ఎంత వేగవంతంగా జరుగుతోందో ప్రత్యక్షంగా చూపిస్తామని విజయవాడ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలిపారు. అలాగే బద్వేలు ఉపఎన్నికకు సంబంధించి మిత్రపక్షం జనసేనతో కలిసి చర్చించి అభ్యర్థి ఎవరనేది ఖరారు చేస్తామని తెలిపారు.
రహదారులు వేయడం అనే కనీస బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం విస్మరించి.. కీలమైన రహదారులను అధ్వానస్థితిలోకి నెట్టిందని సోము వీర్రాజు దుయ్యబట్టారు. మత్స్యకారుల హక్కులను కాలరాసే జీవో 217ను వెంటనే ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. వచ్చే నెల ఏడో తేదీన నెల్లూరులో మత్స్యకార గర్జన సభ నిర్వహిస్తున్నామని.. కేంద్ర మత్స్య శాఖ మంత్రి ఎల్ మురగన్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్యర్యంలో నిర్వహిస్తున్న మత్స్యకార సంక్షేమ పథకాల అమలు తీరును ఈ వేదిక ద్వారా వివరిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 217 వల్ల వల్ల ఏర్పడే సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు.
మాజీ సైనికుల సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్తాం..
మాజీ సైనికుల సమస్యలను స్వయంగా కేంద్ర రక్షణ మంత్రి దృష్టికి తీసుకెళ్లి.. పరిష్కారానికి కృషి చేస్తానని సోము వీర్రాజు తెలిపారు. విజయవాడలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో అజాద్‌కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా మాజీ సైనికులను సన్మానించారు. దేశాన్ని రక్షించే వ్యవస్థ సైనికులు నిర్వహిస్తే, దేశాన్ని పోషించే వ్యవస్థ రైతులది అని కొనియాడారు. రైతులకు చట్టాలు తీసుకొస్తే వాటిని వ్యతిరేకిస్తూ కొన్ని పార్టీలు బంద్ నిర్వహించటం దారుణమన్నారు.
ఇదీ చదవండి