మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ వైకాపాలో మంటలు రేపింది. ఆ పార్టీలో ఇంతకాలం నివురుగప్పిన నిప్పులా ఉన్న అసమ్మతి ఒక్కసారిగా భగ్గుమంది. పార్టీలో తిరుగుబాటు జెండా ఎగిరింది. మంత్రి పదవులు లభిస్తాయని ఆశించిన పలువురు ఎమ్మెల్యేలు అవి దక్కకపోవటంతో బాహాటంగానే అధిష్ఠానం పట్ల ఆగ్రహం, అసంతృప్తి, అసహనం, ఆవేదన, ధిక్కారం, నిరసన వ్యక్తం చేశారు. కొత్త మంత్రివర్గంలోనూ తమను కొనసాగిస్తారని భావించిన తాజా మాజీమంత్రులు కొందరికి ఆ అవకాశం లభించకపోవటంతో వారిలో పలువురు అధిష్ఠానంపై తీవ్రంగా మండిపడ్డారు. ఆయా నాయకుల అనుచరులు, కార్యకర్తలు రోడ్లపైకి చేరి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు.
రాస్తారోకోలు, ద్విచక్రవాహనాల దహనాలు, ఆత్మహత్యయత్నాలు, పదవులకు రాజీనామాలతో తమ ఆగ్రహాన్ని ప్రదర్శించారు. పలుచోట్ల ‘సీఎం డౌన్ డౌన్’ నినాదాలతో హోరెత్తించి ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం సమ్మతం కాదంటూ తీవ్రస్థాయిలో ఆగ్రహాన్ని ప్రదర్శించారు. ఇన్నాళ్లూ పార్టీపట్ల అసంతృప్తి ఉన్నా, మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ నేపథ్యంలో తమకు అవకాశం లభిస్తుందని ఆశతో ఉన్నవారంతా.. ఇక తమకు ఆ ఛాన్సు లేదని తేలిపోవటంతో తమలో రగిలిపోతున్న అసంతృప్తి జ్వాలల్ని ఒక్కసారిగా బయటపెట్టారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 20 మంది ఎమ్మెల్యేలు, వారి అనుచరులు ఇలా ధిక్కారస్వరం వినిపించారు.
భగ్గుమన్న బాలినేని.. సీఎం డౌన్ డౌన్ అంటూ అనుచరుల నినాదాలు..: కొత్త మంత్రివర్గంలో తనను కొనసాగించకపోవటంపై బాలినేని శ్రీనివాసరెడ్డి భగ్గుమన్నారు. ఆయన అనుచరులు ఒంగోలులో సీఎం జగన్ దిష్టిబొమ్మ దహనం చేశారు. మంగమూరు రోడ్డు కూడలిలో ఆందోళన నిర్వహించారు. ఒంగోలులోని వైకాపా కార్యాలయం వద్దకు చేరి సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. తీవ్ర ఆగ్రహంతో ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డిని బుజ్జగించేందుకు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి విజయవాడలోని ఆయన ఇంటికి వెళ్లి బుజ్జగించారు. బాలినేనిని మంత్రివర్గంలో కొనసాగించకపోవడాన్ని నిరసిస్తూ ఇంకొల్లు జడ్పీటీసీ సభ్యురాలు భవనం శ్రీలక్ష్మి తన పదవికి రాజీనామా చేశారు. ఓఎంసీ మేయర్ గంగాడ సుజాత, కౌన్సిలర్లు కూడా రాజీనామాలు చేస్తున్నట్లు ప్రకటించారు.
సజ్జలపై ఆగ్రహజ్వాలలు..: గత మంత్రివర్గంలోని ఎస్సీ మంత్రులందర్నీ కొనసాగించి తననే తప్పించడంపై మేకతోటి సుచరిత తీవ్ర ఆవేదనకు గురయ్యారు. గుంటూరులోని ఆమె నివాసం వద్ద అనుచరులు విలేకరులతో మాట్లాడారు. ఆమెను బుజ్జగించేందుకు వచ్చిన రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణను అడ్డుకున్నారు. సుచరిత రాజీనామా పత్రాన్ని ఆమె అనుచరులు మోపిదేవికి చూపించగా.. ఆయన దాన్ని వారినుంచి లాక్కొన్నారు. తర్వాత సుచరిత కుమార్తె రిషిత మీడియా ముందుకొచ్చి తన తల్లి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారని, పార్టీకి చేయలేదని ప్రకటించారు. అంతకుముందు సుచరిత అనుచరులు గుంటూరు లాడ్జి సెంటర్ వద్ద ధర్నా చేపట్టారు. టైర్లు తగలబెట్టి నిరసన తెలిపారు. రెండు రోజులుగా సుచరిత కుటుంబసభ్యులు సజ్జలను కలిసేందుకు ప్రయత్నిస్తుంటే ఆయన కలవనీయలేదని ఆరోపించారు. సజ్జల డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.
సీఎంవో నుంచి ఫోన్ చేసినా స్పందించని పిన్నెల్లి..: మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మంత్రి పదవి ఇవ్వకపోవడంతో.. అందుకు నిరసనగా ఎంపీడీవో కార్యాలయం వద్ద నియోజకవర్గ పరిధిలోని సర్పంచులు, ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులు, కౌన్సిలర్లు సమావేశమయ్యారు. అక్కడి నుంచి ప్రదర్శనగా బస్టాండు కూడలికి చేరారు. ప్రధాన రహదారిపై కొంతసేపు రాస్తారోకో చేశారు. మంత్రివర్గంలో పిన్నెల్లికి చోటు కల్పించకపోవడాన్ని తప్పుబట్టారు. సజ్జల రామకృష్ణారెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. తమ పదవులకు రాజీనామాలు చేస్తామని ప్రకటించారు. సీఎంవో నుంచి కార్యదర్శి ధనుంజయరెడ్డి... పిన్నెల్లికి ఫోన్ చేయగా ఆయన స్పందించలేదు. ఎవరికీ అందుబాటులోకి వెళ్లలేదు. మాచర్ల, వెల్దుర్తి, దుర్గి, కారంపూడి, రెంటచింతల మండలాల పరిధిలో ప్రధాన రహదారులపై పిన్నెల్లి అనుచరులు రాస్తారోకోలు చేశారు. టైర్లు, ద్విచక్ర వాహనాలను దహనం చేసి నిరసన తెలిపారు. రెంటచింతల-5 ఎంపీటీసీ సభ్యురాలు పాముల సంపూర్ణమ్మ ఆత్మహత్యకు యత్నించగా.. అక్కడున్నవారు ఆమెను అడ్డుకున్నారు.
కంటతడి పెట్టిన కోటంరెడ్డి..: మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంపై నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఆవేదనతో కంటతడి పెట్టుకున్నారు. అసంతృప్తితో కూడిన భావోద్వేగానికి లోనైన ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తనకు మంత్రిపదవి రాకపోవడానికి కారణమేంటో అర్థం కావట్లేదని అన్నారు. మొదటి మంత్రివర్గంలోనే చోటు దక్కుతుందని ఆశించానని, అప్పుడు మొండిచెయ్యి చూపారని, మళ్లీ విస్తరణలో అయినా వస్తుందని ఆశిస్తే ఇప్పుడూ దక్కలేదని వాపోయారు. జగన్‌మోహన్‌రెడ్డి నెల్లూరు జిల్లాలో ఓదార్పు యాత్ర చేసినప్పుడు అన్నీ తానై చూసుకున్నానన్నారు. రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే చేయని విధంగా గడపగడపకూ వెళ్తూ ప్రతి కార్యకర్తనూ కలుస్తున్నా తనకు మంత్రిపదవి రాకపోవడమేంటో అర్థం కావట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంతకుముందు నియోజకవర్గంలోని సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, కార్పొరేటర్లు తమ పదవులకు రాజీనామాలు ప్రకటించారు. రాజీనామాలు వద్దని వారిని కోటంరెడ్డి వారించారు.
ఉదయభాను అనుచరుల ఆగ్రహజ్వాల..: ప్రభుత్వ విప్ సామినేని ఉదయభానుకు రాష్ట్ర మంత్రివర్గంలో చోటు లభించకపోవడంతో ఆయన అనుచరులు ఆగ్రహజ్వాలలు ప్రదర్శించారు. జగ్గయ్యపేటలోని ఉదయభాను ఇంటివద్ద పార్టీశ్రేణులు నిరసన తెలిపాయి. సారథి అనే కార్యకర్త ఒంటిపై పెట్రోలు పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. పక్కనున్న నాయకులు అతన్ని నిలువరించారు. బస్టాండ్ సమీపంలో కొందరు నిరసన ప్రదర్శనకు ప్రయత్నించగా పోలీసులు వారించారు. పెనుగంచిప్రోలు మండలానికి చెందిన కార్యకర్తలు ముండ్లపాడు సమీపంలోని జాతీయ రహదారిపైకి చేరుకొని నిరసన తెలిపారు. రోడ్డుపై టైర్లు వేసి కాల్చారు. తర్వాత ద్విచక్రవాహనంపై పెట్రోల్ చల్లుతున్న ఇద్దరు, పక్కనే ఉన్న మరో ఇద్దరికి మంటలు చుట్టుముట్టాయి. వెంటనే సహచరులు స్పందించి మంటలు ఆర్పారు. హైవేపై వాహనాలు ఆగిపోయాయి. పోలీసులు అక్కడికి చేరుకొని ఆందోళనకారులను స్టేషన్‌కు తరలించారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. సీఎం డౌన్ డౌన్ అంటూ ఉదయభాను అనుచరులు నినాదాలు చేశారు. కేడీసీసీబీ ఛైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు, జగ్గయ్యపేట మున్సిపల్ ఛైర్మన్ రంగాపురం రాఘవేంద్ర, వత్సవాయి ఎంపీపీ చెంబేటి వెంకటేశ్వరరావు, కొందరు ప్రజాప్రతినిధులు, నాయకులు తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
రాజీనామాల పర్వం...: శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డికి మంత్రి పదవి ఇవ్వకపోవడానికి నిరసనగా ఆత్మకూరు పురపాలక సంఘం కౌన్సిలర్లు అయిదుగురు వారి పదవులకు రాజీనామా చేశారు.
- చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీకి మంత్రిపదవి ఇవ్వనందుకు నిరసనగా చోడవరం, రావికమతం, రోలుగుంటలలో వైకాపా నాయకులు, కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. అర్ధనగ్న ప్రదర్శన చేశారు. ప్రధాన కూడలిలో టైర్లకు మంట పెట్టి, అధిష్ఠానం తీరుపై ధ్వజమెత్తారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.
- తిరువూరు ఎమ్మెల్యే రక్షణనిధికి పదవి ఇవ్వలేదని ఆయన అనచరులు రాజీనామాలకు చేసేందుకు సిద్ధపడ్డారు.
- గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే ముస్తఫాకు మంత్రివర్గంలో స్థానం కల్పించలేదని ఆయన వర్గీయులు కార్యాలయం ఎదుట రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.
- గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు సోమవారం తన నిర్ణయాన్ని వెల్లడిస్తానని వ్యాఖ్యానించారు.
పార్థసారథి అనుచరుల ఆందోళన..: పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథికి మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంపై వైకాపా నాయకులు, కార్యకర్తలు భగ్గుమన్నారు. పెనమలూరు, కంకిపాడు, ఉయ్యూరు మండలాల ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు, అభిమానులు విజయవాడ ఎంజీ రోడ్డులోని పార్థసారథి కార్యాలయానికి చేరుకుని రహదారిపై ఆందోళనకు దిగారు. సిగ్నల్ వద్ద బారికేడ్లను తొలగించి బైఠాయించడంతో ట్రాఫిక్ స్తంభించింది. పార్థసారథి అక్కడకు చేరుకున్నారు. అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉండాలని సూచించి ఆందోళనను విరమింపజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు మంత్రిపదవి వస్తుందని కార్యకర్తలు భావించారన్నారు. సీనియర్ నాయకుడిని అని, ఎంతో సేవ చేశానని.. పార్టీ తనకు న్యాయం చేస్తుందని భావించానని, కానీ సమీకరణాల్లో తనకు న్యాయం జరగలేదన్నారు.
ముస్తఫాకు మంత్రి పదవి కేటాయించాలి..: గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫాకు మంత్రి పదవిని కేటాయించాలని వైకాపా నాయకులు, కార్యకర్తలు నినదించారు. గుంటూరు బి.ఆర్.స్టేడియంలోని ఆయన కార్యాలయం ఎదురుగా ఉన్న రహదారిపై ఆదివారం రాత్రి రోడ్డుపై బైఠాయించి వారు వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు.
ఇదీ చదవండి: తిప్పేస్వామి స్థానంలో ఆదిమూలపు సురేశ్.. చివరి నిమిషంలో మార్పు