మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటి వద్ద శుక్రవారం వైకాపా, తెదేపా వర్గీయులు పరస్పరం దాడులు చేసుకున్న ఘటనలపై తాడేపల్లి పోలీసుస్టేషన్‌లో నాలుగు కేసులు నమోదయ్యాయి. పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ కారు డ్రైవర్ తాండ్ర రాము ఇచ్చిన ఫిర్యాదు మేరకు తెదేపాకు చెందిన 11 మంది నేతలపై ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేశారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, అధికార ప్రతినిధి పట్టాభి, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ తదితర 11 మంది నాయకులతో సహా గుర్తు తెలియని మరో 30మంది తనను కులం పేరుతో దూషించారని రాము ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కొవిడ్ నిబంధనల ఉల్లంఘన, సమూహంగా ఏర్పడ్డారని, విధులకు ఆటంకం కలిగించారని తదితర సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
తెదేపా అధినేత చంద్రబాబు ఇంటిపై దాడి జరుగుతుందని తెలుసుకుని అక్కడకు వెళ్లి, ఆయన ఇంట్లోకి చొచ్చుకెళుతున్న వైకాపా శ్రేణులను నిలువరిస్తే తమపై దాడులకు తెగబడ్డారని మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, తాడేపల్లి పట్టణ అధ్యక్షుడు జంగాల సాంబశివరావు, మరో కార్యకర్త తమ్మా శంకర్‌రెడ్డి వేర్వేరుగా ఫిర్యాదు చేశారు. చంద్రబాబు ఇంటి ముట్టడికి రావడం ఏమిటని ప్రశ్నించినందుకు తనను కర్రలు, రాళ్లతో పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ మరో 30-40 మంది దాడి చేసి గాయపరిచారని జంగాల సాంబశివరావు ఫిర్యాదుచేయగా జోగి రమేష్‌పై కేసు నమోదు చేశారు. శుక్రవారం జరిగిన దాడి ఘటనపై బాధితుల నుంచి ఫిర్యాదులు అందుకున్న తాడేపల్లి పోలీసులు శుక్రవారం కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కొవిడ్ నిబంధనల ఉల్లంఘన, సమూహంగా ఏర్పడటం, గుంపులుగా తరలి రావడం, కర్రలు, రాళ్లు చేతబూనడం, ప్రజల రాకపోకలను అడ్డగించడం, ప్రజాసేవకుల విధులకు ఆటంకం కలిగించారని పలు సెక్షన్లు పెట్టి దర్యాప్తు చేస్తున్నారు. తాండ్ర రాము, జంగాల సాంబశివరావుతో పాటు డీజీపీ కార్యాలయంలో ఏఎస్సై మధుసూదనరావు, కడప జిల్లాకు చెందిన ఏఆర్ ఎస్సై తిరుమలయ్య ఫిర్యాదు మేరకు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
అన్ని మార్గాల్లో ఫుటేజీల సేకరణ...
ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం, పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ వాహనశ్రేణి ప్రయాణించిన మార్గాల్లో సీసీటీవీ ఫుటేజీలు సేకరించే పనిలో పోలీసులు తలమునకలై ఉన్నారు. చంద్రబాబు నివాసం వద్ద పోలీసు గరుడ కంట్రోల్‌రూమ్ ఉంది. అందులో సీసీటీవీ ఫుటేజీలు తీసి ఘర్షణ విజువల్స్‌ను సేకరించినట్లు తెలిసింది. డీజీపీ కార్యాలయం వద్ద వివరాలనూ సేకరిస్తున్నారు.
ఇదీచదవండి.