బలహీన వర్గాలపై దాడులు చేస్తే ఊపేక్షించబోమని చెప్పిన 24 గంటలలోపే ముఖ్యమంత్రి నివాసానికి సమీపంలోనే బీసీలపై దాడి జరగడం దుర్మార్గమని రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ మండిపడ్డారు. గుంటూరు జిల్లా కొల్లిపర మండలం మున్నంగి గ్రామంలో బీసీ వర్గానికి చెందిన శొంఠి సాంబశివరావు అనే గౌడ కులస్థున్ని కులం పేరుతో దూషించి... అర్ధనగ్నంగా నేలపై కూర్చొబెట్టి, కాళ్లతో తన్నడం దుర్మార్గమైన చర్య అని అనగాని మండిపడ్డారు. ఇది మెుత్తం బీసీలందరినీ అవమానించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులైన వారందరిని కఠినంగా శిక్షించాలని అనగాని డిమాండ్ చేశారు.
బీసీలపై ఎందుకంత కక్ష..
బీసీలను అవహేళన చేసినందుకు ముఖ్యమంత్రి క్షమాపణలు చెప్పాలన్నారు అనగాని. వెనకబడిన వర్గాలపై వైకాపా నాయకులు చేస్తున్న దౌర్జన్యాలు, దోపిడీలు చూస్తుంటే ప్రజాస్వామ్యంలో ఉన్నామా, రాచరిక పాలనలో ఉన్నామా అన్న సందేహం కలుగుతోందని విమర్శించారు. బీసీల పట్ల వైకాపా ప్రభుత్వం ఎందుకు ఇంత కక్షకట్టిందని ప్రశ్నించారు. బీసీలు అన్ని విధాలుగా ఎదిగితే ఎక్కడ ప్రభుత్వ తప్పుడు విధానాలను ప్రశ్నించి ఎదిరిస్తారన్న భయంతోనే,,, వారిని అణచివేసి రాజకీయ లబ్ధి పొందేందుకు వెనకబడిన వర్గాలపై కుట్ర పన్నారని మండిపడ్డారు. 15 నెలల్లో బీసీలకు చేసింది శూన్యమన్న ఆయన... అక్రమ కేసులు, దాడులతో కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. కుల వృత్తులు చేసుకునే బలహీన వర్గాలంటే ఎందుకంత కక్ష అని అనగాని నిలదీశారు.
ఇవీ చదవండి: