వైకాపా పార్లమెంటరీ పార్టీ నేతగా వ్యవహరిస్తున్న విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యత్వాన్ని వైకాపా మరోమారు పొడిగించనుంది. రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నలుగురు రాజ్యసభ సభ్యుల పదవీ కాలం త్వరలో ముగియనుంది. ఎమ్మెల్యేల సంఖ్యాబలం పరంగా చూస్తే ఈ నాలుగు సీట్లూ వైకాపాకే దక్కనున్నాయి. ఈ నలుగురిలో విజయసాయిరెడ్డి పదవి జూన్‌లో ముగియనున్నప్పటికీ ఆయన్ను మరోసారి రాజ్యసభకు పంపేందుకు ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించినట్లు తెలిసింది. దీంతో మిగిలిన 3 సీట్లు ఎవరెవరికి ఇస్తారనేది చర్చనీయాంశంగా మారింది.
నెల్లూరు జిల్లాకు చెందిన బీద మస్తాన్‌రావుకు బీసీ కోటాలో సీటు ఖరారైనట్లు వైకాపా వర్గాలు తెలిపాయి. మరో స్థానాన్ని కార్పొరేట్ దిగ్గజం గౌతమ్ అదానీ కుటుంబానికి ఇచ్చే అవకాశం ఉందని వైకాపా వర్గాల్లో చర్చ నడుస్తోంది. అదానీ ఇప్పటికే రెండుసార్లు వచ్చి ముఖ్యమంత్రిని కలిసి వెళ్లిన సంగతి తెలిసిందే. ఇక నాలుగో స్థానానికి.. జగన్ కేసుల్లో న్యాయవాది నిరంజన్‌రెడ్డి పేరు పరిశీలనలో ఉన్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మహిళలకు ఇవ్వాలనుకుంటే ఉత్తరాంధ్ర నుంచి కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి పేరును పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉందని వైకాపా వర్గాలు తెలిపాయి. సామాజిక సమీకరణాలు సర్దుబాటు కాకపోతే ఒక సీటును ఎస్సీలకుగానీ, మైనారిటీలకుగానీ కేటాయించవచ్చని చెబుతున్నారు. అయితే ఈ వర్గాల నుంచి ఎవరు పోటీలో ఉన్నారో స్పష్టత రావడం లేదు. శుక్రవారంగానీ, సోమవారంగానీ నాలుగు పేర్లను ఖరారు చేసి అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు సీఎంవో వర్గాలు తెలిపాయి.
ఇవీ చూడండి: