కృష్ణా జిల్లాలో మొత్తం రెండు నగరపాలక సంస్థలకు, రెండు పురపాలక సంస్థలకు, మూడు నగర పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఒక్కోచోట ఒక్కో రీతిలో రాజకీయం వేడెక్కుతోంది. విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో పోటాపోటీగా ప్రచారం సాగుతోంది. తెదేపా మేయర్ అభ్యర్థిని ప్రకటించడంతో వివాదాలకు తెరపడింది. ఈ ఎన్నికల్లో తెదేపా, సీపీఐ అవగాహన కుదుర్చుకోగా... జనసేన-భాజపా మధ్య పొత్తు కుదిరింది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో నేతలు ప్రచారం నిర్వహిస్తున్నారు. అధికార పార్టీ వైకాపా తరపున మంత్రులు రంగంలోకి దిగారు. విజయవాడ కార్పొరేషన్‌లో అధికార పార్టీకి తిరుగుపోటు తప్పలేదు. 3 నియోజకవర్గాల్లోనూ తిరుగుబాటు అభ్యర్థులున్నారు.
మొత్తం 64 డివిజన్లు ఉండగా... 5 ప్రాంతాల్లో తిరుగుబాటు అభ్యర్థులు రంగంలోకి దిగారు. తూర్పు నియోజకవర్గంలోని ఆరో డివిజన్ నుంచి సారేపల్లి సుధీర్‌కుమార్ రెబల్‌గా రంగంలో దిగారు. ఇక్కడ వియ్యపు అమర్‌నాథ్ వైకాపా అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. తనకు టిక్కెట్ ఇవ్వలేదని సుధీర్ తిరుగుబాటు అభ్యర్థిగా ఉన్నారు. 15వ డివిజన్ నుంచి వైకాపా తరపున ఝాన్సీరాణి టిక్కెట్ ఆశించి భంగపడ్డారు. ఆమె జనసేనలో చేరి టిక్కెట్ తెచ్చుకున్నారు. ఇక్కడ తెదేపా అభ్యర్థి ఉపసంహరించుకొని జనసేన అభ్యర్థినికి మద్దతు ప్రకటించారు.
18వ డివిజన్లో వైకాపా అభ్యర్థిగా వెంకటసత్యనారాయణకు టిక్కెట్ ఇచ్చారు. రెబల్‌గా జి. రమేష్ పోటీలో ఉన్నారు. 21వ డివిజన్‌లోనూ పుప్పాల కుమారి వైకాపా అభ్యర్థిగా ఉండగా... టిక్కెట్ ఆశించిన నిమ్మల జ్యోతి అసంతృప్తితో ఉన్నారు. మధ్య నియోజకవర్గంలోనూ తిరుగుబాట్లు ఉన్నాయి. మధ్య నియోజకవర్గం నుంచి 30వ డివిజన్లో వైకాపా అభ్యర్థిగా జానారెడ్డికి టికెట్ ఇవ్వగా.. తుంపాల వరప్రసాద్ రెబల్‌గా పోటీలో ఉన్నారు. ఇద్దరు జగన్ చిత్రంతో ప్రచారం చేస్తున్నారు.
30వ డివిజన్లో తెదేపాకు తిరుగుపోటు ఉంది. పార్టీ తరపున గోగుల రమణ పోటీ చేస్తున్నారు. మాజీ డిప్యూటీ మేయర్‌గా పనిచేశారు. కేశినేని ఆయనకు టిక్కెట్ ఇవ్వగా.. మాజీఎమ్మెల్యే బొండా ఉమా ఆశీస్సులతో గరిమెళ్ల చిన్నా పోటీ చేస్తున్నారు. రెండు ప్రాధాన పార్టీలకు 30వ డివిజన్లో తిరుగుబాటు అభ్యర్థులు గట్టిగానే ఉన్నారు. జనసేన-భాజపా పొత్తు కుదుర్చుకోగా.. 25, 28, 32 డివిజన్లలో ఇరుపార్టీల అభ్యర్థులు రంగంలోకి దిగారు. 23వ డివిజన్లో భాజపా అభ్యర్థిగా ఎన్. రంగారావును పోటీలో దించగా... ఆయనకు పార్టీ గుర్తు రాలేదు. స్వతంత్ర అభ్యర్థిగా ఉన్నారు. పార్టీ గుర్తు ప్రవీణ్‌కు వచ్చింది.
పశ్చిమ నియోజకవర్గంలోనూ సమీకరణాలు మారుతున్నాయి. 43వ డివిజన్ నుంచి రామిరెడ్డి వైకాపా రెబల్‌గా ఉన్నారు. వైకాపా అభ్యర్థిగా కోటిరెడ్డికి టిక్కెట్ ఇచ్చారు. 51వ డివిజన్లో పైడిపట్టి మురళి రెబల్‌గా పోటీలో ఉండగా... వైకాపా టిక్కెట్ రాజేష్‌కు ఇచ్చారు. 50వ డివిజన్లో జనసేన పార్టీకి చెందిన హరీష్‌కుమార్ నామినేషన్ వేశారు. ఆయన నామినేషన్ ఉపసంహరించుకోవడంతో జనసేన సీపీఎం అభ్యర్థికి అధికారికంగా మద్దతు ప్రకటించింది.
మచిలీపట్నం నగరపాలక సంస్థ, పెడన, నూజివీడు పురపాలక సంఘాల్లో తిరుగుబాట్లు లేవు. ఇక్కడ ప్రచారం ఏకపక్షంగానే సాగుతోంది. నందిగామ నగరపంచాయతీలో మూడు వార్డుల్లో తిరుగుబాట్లు ఉన్నాయి. 1వ వార్డు నుంచి పాకాలపాటి కృష్ణ వైకాపా అభ్యర్థిగా రంగంలో ఉండగా.. తిరుగుబాటు అభ్యర్థిగా గుంటి విజయమ్మ రంగంలోకి దిగింది. 16వ డివిజన్లో వైకాపా అభ్యర్థిగా అచ్చి దివ్య పోటీ చేశారు. రెబల్‌గా నామినేషన్ వేసిన లక్ష్మీతులసికి వైకాపా టిక్కెట్ రాకపోవడంతో తెదేపాలో చేరారు. ఆమె స్వతంత్ర అభ్యర్థిగా ఉండగా తెదేపా ప్రచారం చేస్తోంది.
20వ వార్డులో కర్రి రవీంద్రకు టిక్కెట్ ఇచ్చారు. చేపల మల్లికార్జునరావు వైకాపా రెబల్‌గా ఉన్నారు. తిరువూరులోనూ 17వ వార్డులో పమ్మి రామకృష్ణ వైకాపా తిరుగుబాటు అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. వైకాపా టిక్కెట్ షేక్ జాకీర్‌కు ఇచ్చారు. రెబల్‌గా ఉన్న రామకృష్ణను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఉయ్యూరులో మాజీ కౌన్సిలర్ గుంజి రాంబాబు వైకాపా తిరుగుబాటు అభ్యర్థిగా ఉన్నారు. ఇక్కడ వైకాపా టిక్కెట్ గుంజి సుధాకర్‌బాబుకు ఇచ్చారు. ఇద్దరు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. తిరుగుబాటు అభ్యర్థులు ప్రధాన పార్టీల అభ్యర్థులతో సమానంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అసమ్మతి వాదుల మద్దతును రెబల్స్ తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇదీ చదవండీ... టీ కప్పులో తుపాను...వివాదం సమసిపోయిందంటున్న తెదేపా నేతలు