ఆడుతూ, పాడుతూ చదువుకోవాల్సిన వయసులో ప్రాణాలతో పోరాడుతున్నది ఓ చిన్నారి. పదేళ్ల ప్రాయంలోనే ఎముకల వ్యాధితో నరకయాతన అనుభవిస్తోంది. చిన్నప్పటి నుంచి ఆరోగ్యంగా, అందంగా ఉన్న పాప... ఒకరోజు ఆడుకుంటూ జారి పడింది. తలకు, కాళ్లకు, చేతులకు గాయాలయ్యాయి. వైద్యులకు చూపించినా లాభం లేకుండా పోయింది. కాలుకు వాపు వచ్చి ఆరు నెలల్లోనే విపరీతంగా ఉబ్బింది. కాలు నుంచి తలకు, అక్కడి నుంచి కాస్త దిగువకు విస్తరించి, చివరికి ఒక కన్ను పూర్తిగా మూసుకుపోయింది. తలకు ఏర్పడిన కంతి కాలక్రమేణా క్యాన్సర్‌గా మారిందని వైద్యపరీక్షల్లో బయటపడింది.
తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం సిద్దన్నపేటకు చెందిన కిష్టయ్యది నిరుపేద కుటుంబం. భార్య లక్ష్మి బీడీ కార్మికురాలిగా పని చేస్తుండగా... కిష్టయ్య కూలి పని చేస్తున్నాడు. రెక్కాడితే కానీ డొక్కాడని తమకు కన్నబిడ్డను బతికించుకోవడం కష్టంగా మారిందని వాపోతున్నారు. ఇప్పటికే అప్పులు చేసి మరీ పాప వైద్యానికి 4 లక్షలకు పైగా ఖర్చుచేసినట్లు చిన్నారి తల్లిదండ్రులు చెబుతున్నారు. తినేందుకు తిండిలేక, పాపను బతికించుకునే స్థోమత లేక రోజూ నరకం అనుభవిస్తున్నమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పదేళ్ల ప్రాయంలోనే క్యాన్సర్తో నరకం అనుభవిస్తున్న తమ కూతుర్ని కాపాడేందుకు దాతలు సాయం చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు
.
ఇవీ చూడండి: మరో 3రోజులు చిదంబరం కస్టడీ పొడిగింపు