రాష్ట్ర ప్రభుత్వం తెలుగు అకాడమీ పేరు మారుస్తూ ఇచ్చిన ఉత్తర్వులు తెలుగు భాషాభిమానులను నిరుత్సాహపరిచేలా ఉన్నాయని.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. తెలుగు భాష అభివృద్ధి, వినియోగం కోసం కృషి చేయాల్సిన అకాడమీ అస్తిత్వాన్ని దూరం చేసేలా పేరు మార్చారని ఓ ప్రకటనలో ఆరోపించారు. తెలుగు- సంస్కృత అకాడమీ అని ఎందుకింత హడావుడిగా పేరు మార్చాల్సి వచ్చిందో ప్రభుత్వం, అకాడమీ బాధ్యులు ప్రజలకు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పేరు మార్చడం ద్వారా సాధించే ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు. ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు తెలుగు అకాడమీ పుస్తకాలు ఎంతో ఉపయుక్తంగా ఉంటూ వచ్చాయని, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవారు సైతం ఈ పుస్తకాలనే ఎంచుకుంటారన్నారు. తెలుగు భాషకు సంబంధించి పలు నిఘంటువులు, వృత్తి పదకోశాలు ఈ అకాడమీ ద్వారా వచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. అకాడమీ ద్వారా భాషాభివృద్ధికి మరిన్ని చర్యలు తీసుకోవాల్సింది పోయి పేరు మారిస్తే భాష అభివృద్ధి చెందుతుందా? అని నిలదీశారు.
తెలుగు అకాడమీకి ప్రభుత్వం తగిన నిధులు మంజూరు చేయకపోవడంతో అక్కడి కార్యకలాపాలు కొంతకాలం నుంచి నిస్తేజంగా ఉన్నాయని పవన్ విమర్శించారు. సంస్కృత భాష అభివృద్ధి కోసమే పేరు మార్పు అనుకుంటే ప్రత్యేకంగా సంస్కృత అకాడమీ ఏర్పాటు చేయవచ్చని సూచించారు. దిల్లీ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్న సంస్కృత అకాడమీ లాంటిది ఇక్కడ కూడా ప్రారంభించవచ్చన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అకాడమీ పేరు మార్పు నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కోరారు. తెలుగు అకాడమీ అస్తిత్వాన్ని కాపాడేందుకు తెలుగు భాషాభిమానులు, భాషా శాస్త్రవేత్తలు ముందుకు రావాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు.
ఇదీ చదవండి: