నూతన సంవత్సరం వేడుకలు ఇళ్లలోనే అంటున్నారు విజయవాడ ప్రజలు. తెలంగాణ ప్రభుత్వం బార్లకు అర్థరాత్రి 12గంటల వరకు, వేడుకలకు ఒంటి గంట వరకు అనుమతులివ్వటంతో ఏపీలోనూ అదే తరహా అనుమతులొస్తాయని నిర్వాహకులు ఆశించారు. అయితే అలాంటి వాతావరణమేమీ లేకపోవటంతో నగరంలో ఎక్కడా నూతన సంవత్సర వేడుకలకు అవకాశం లేకుండా పోయింది.
కొన్ని స్టార్ హోటళ్లలో పరిమిత సంఖ్యలో చిన్నపాటి కార్యక్రమాలు నిర్వహిస్తుండగా అంతకు మించి ఆహ్లాదం కొత్త సంవత్సరం ప్రారంభానికి లేదనే చెప్పాలి. నగరానికి ప్రధాన రహదారులైన బందర్ రోడ్డు, బీఆర్టీఎస్, ఏలూరు రోడ్డులతో పాటు మూడు ప్రధాన పై వంతెనలు మూసివేయాలని పోలీసులు ఆంక్షలు విధించారు. ఆరుబయట ప్రదేశాల్లో వేడుకలపై నిషేధం విధించటంతో పాటు, ఫంక్షన్ హాల్స్ ,హోటల్స్, పబ్‌ల్లో షరతులతో కూడిన అనుమతులిచ్చారు. చివరి నిమిషంలో ఏర్పాట్లకు అవకాశం లేక నిర్వాహకులు ముందుకు రావట్లేదు. ఒకటి రెండు చోట్ల మాత్రమే వేడుకలకు ఏర్పాట్లు చేస్తున్నారు.
చిన్న పాటి కేకులు, బిర్యానీ పార్శిల్స్ తో ఆకర్షణీయమైన ధరలు, కాంబో ఆఫర్లతో రెస్టారెంట్లు ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. టేక్ అవే కు ప్రత్యేక కౌంటర్ల ఏర్పాటు చేసి రాత్రి 7గంటల నుంచి బిర్యానీ, కూల్ డ్రింక్స్, చిన్నపాటి కేక్ కూడిన కాంబో ప్యాక్ లను అందుబాటులోకి తెచ్చేందుకు రెస్టారెంట్ నిర్వాహకులు సిద్ధమవుతున్నారు. కరోనా, ఒమిక్రాన్ తీవ్రత దృష్ట్యా ప్రజల్లోనూ అంతగా స్పందన లేదని హోటల్ యాజమాన్యాలు అంటున్నాయి.
ఇవీచదవండి.