Nari Sankalpa Deeksha :జగన్ పాలనలో రాష్ట్రంలో ఎటు చూసినా... మహిళలపై అఘాయిత్యాలు, అత్యాచారాలు, హత్యలు, జరుగుతున్నాయని తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత దుయ్యబట్టారు. తెలుగుదేశం కేంద్ర కార్యాలయంలో నారీ సంకల్ప దీక్ష చేసిన అనితకు తెదేపా నేత వర్ల రామయ్య నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపచేశారు. జగన్ లాంటి చేతకాని వ్యక్తి సీఎం కావటం ప్రజల దురదృష్టమని... పొదుపు మహిళల 2 వేల కోట్ల రూపాయలు కాజేసిన దుర్మార్గుడు సీఎం అని అనిత ఆరోపించారు. రోజుకో మహిళ అత్యాచారానికి గురవుతుంటే... తాడేపల్లి ప్యాలెస్‌లో గన్నుకు తుప్పుపట్టిందా అని మహిళా నేతలు ఎద్దేవా చేశారు. విశాఖపట్నం జిల్లా రాజయ్యపేటకు చెందిన చిన్నారి అత్యాచారానికి గురైతే ఇంతవరకు బాధితులపై చర్యలు లేవని చిన్నారి మేనత్త వాపోయింది. కుటుంబానికి జరిగిన అన్యాయంతో తన సోదరుడు విషం తీసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని విలపించింది.
వైకాపా పాలనలో నిందితులకే వత్తాసు..
వైకాపా పాలనలో మహిళలకు రక్షణ లేదని మాజీమంత్రి పీతల సుజాత ఆరోపించారు. వైకాపా పాలనలో నిందితులకే వత్తాసు పలుకుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో మహిళా కమిషన్ ఉందో లేదో తెలియని పరిస్థితి ఉందని అన్నారు. మహిళలకు ఆస్తి హక్కు, ఆత్మ స్థైర్యం కల్పించిన ఘనత తెదేపాదేనని పేర్కొన్నారు. తెదేపా పాలనలో మహిళపై దాడి జరిగితే వెంటనే చర్యలు ఉండేవని తెలిపారు.
అరెస్ట్ చేసే దమ్ము జగన్ రెడ్డికి ఉందా..
మహిళలపై అత్యాచారాలు, దాడులు చేసిన వారిని అరెస్ట్ చేసే దమ్ము జగన్ రెడ్డికి ఉందా అని తెలంగాణ తెలుగు మహిళ అధ్యక్షురాలు తిరునగరి జ్యోత్స్న నారీ సంకల్ప దీక్షలో నిలదీశారు. ఆడపిల్లల జీవితాలతో ఆడుకున్న 1500మందికి పైగా మృగాళ్లలో ఎందరికి ఉరేశారని ప్రశ్నించారు. పోక్సో చట్టం రాష్ట్రంలో నిర్వీర్యమవుతోందని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు. తల్లీ, చెల్లికీ న్యాయం చేయలేని ముఖ్యమంత్రి ఆడబిడ్డలకు రక్షణ ఎలా కల్పిస్తాడని అగన్వాడీ విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత విమర్శించారు. ముఖ్యమంత్రి నివసించే ప్రాంతంలో రోజుకో మహిళ అత్యాచారానికి గురవుతుంటే ఏం చర్యలు తీసుకున్నారని ఆమె ప్రశ్నించారు. వైకాపా కాలకేయులు మహిళల జీవితాలను కబళించేస్తున్నారని ఆమె ఆగ్రహాం వ్యక్తంచేశారు.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చదవండి