MP KESINENI NANI: వంగవీటి రాధాపై జరిగిన హత్యాయత్నానికి సంబంధించి సీబీఐ విచారణ జరిపించాలని విజయవాడ ఎంపీ కేశినేని నాని డిమాండ్ చేశారు. దీనిపై విజయవాడ ఎంపీగా కేంద్ర హోంశాఖకు లేఖ రాస్తానని ఆయన తెలిపారు. విజయవాడలో మళ్లీ పాత రక్త చరిత్ర పునరావృతం చేసేందుకు కొందరు యత్నిస్తున్నారని ఆరోపించారు. వంగవీటి రాధాను విజయవాడ ఎంపీ కేశినేని నాని, మాజీ మంత్రి నెట్టెం రఘురాం, మాజీ ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య ఇతర నేతలు ఆయన నివాసంలో కలిశారు.
రాధాపై రెక్కీ నిర్వహించిన నేపథ్యంలో ఎంపీ నాని, మాజీ మంత్రి నెట్టెం రఘురాం కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బెజవాడలో ఎప్పుడూ కులాల మధ్య గొడవలు లేవన్న నాని.. కొందరు స్వార్థపరులు వంగవీటి కుటుంబానికి అనుచరులుగా నటిస్తూ కులాల మధ్య చిచ్చు పెట్టారని దుయ్యబట్టారు. వంగవీటి కుటుంబం రాష్ట్రానికి ఓ సంపద అని.. 60వ దశకం నుంచి పేదవారికి అండగా నిలిచిన కుటుంబం వంగవీటిదని కేశినేని నాని గుర్తుచేశారు. తెదేపా అధికారంలోకి రాగానే పార్టీలో చేరి అధికారం పోగానే వైకాపాలో చేరిన వాళ్లు ఎన్టీఆర్ భవన్ విధ్వంసానికి పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: Vangaveeti Radha Issue: వంగవీటి రాధా ఇంటి వద్ద రెక్కీ.. విజయవాడ సీపీ ఏం చెప్పారంటే..?