పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రిగా గుడివాడ అమర్నాథ్ సచివాలయంలో బాధ్యతలు తీసుకున్నారు. రామాయపట్నం పోర్టు నిర్వాసిత రైతులకు పరిహారం కోసం రూ.8 కోట్లు విడుదల చేస్తూ మొదటి సంతకం చేశారు. మంత్రి పదవి ఇచ్చిన సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఐటీ మంత్రిగా తనపై పెద్ద బాధ్యతను పెట్టారని.., పెట్టుబడులు, పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తానని అమర్నాథ్ స్పష్టం చేశారు. పారిశ్రామిక ప్రగతికి, ఐటీ అభివృద్ధికి విశాఖను చిరునామాగా మారుస్తామన్నారు. పారిశ్రామిక అభివృద్ధికి ఏపీ ఎంతో అనుకూలంగా ఉందన్నారు. 2,700 మందికి ఉద్యోగాలు కల్పించే గ్రాసిమ్ ఇండస్ట్రీస్ ఇవాళ ప్రారంభమవుతోందని పేర్కొన్నారు.
కేంద్ర నిధులు రప్పించేందుకు ప్రయత్నిస్తా: గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కేంద్ర నిధులను రప్పించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తామని డిప్యూటీ సీఎం, గిరిజన సంక్షేమశాఖ మంత్రి పీడిక రాజన్నదొర స్పష్టం చేశారు. ఇవాళ సచివాలయంలో గిరిజన సంక్షేమశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన.. గిరిజన ప్రాంతాల్లోని ఆవాసాలకు చేరుకునేలా రహదారుల నిర్మాణం చేపట్టాల్సి ఉందన్నారు. గిరిజన సహకార సంస్థలో కారుణ్య నియామకాలపై మంత్రి తొలి సంతకం చేశారు.
వాస్తవ పరిస్థితులే చెబుతున్నా..: జలవనరుల శాఖ మంత్రిగా అంబటి రాంబాబు బాధ్యతలు చేపట్టారు. పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రాం వాల్ ధ్వంసం కావడానికి గత ప్రభుత్వం తీసుకున్న తొందరపాటు నిర్ణయాలే కారణమని ఆరోపించారు. కట్టడాలకు సంబంధించి ప్రణాళికా లోపం వల్లే ఈ దుస్థితి తలెత్తిందని విమర్శించారు. తాను జలవనరులశాఖ మంత్రిగా కావాలని ఆరోపణలు చేయటం లేదని.., వాస్తవ పరిస్థితినే వివరిస్తున్నానని తెలిపారు.
వ్యవసాయ అనుబంధ రంగాలకు పెద్దపీట: గన్నవరంలో రాష్ట్ర విత్తన పరిశోధన, శిక్షణా సంస్థ ఏర్పాటుకు నిర్ణయించినట్లు వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతుల ఆర్ధిక అవసరాలు తీర్చేలా ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ఖాతాలకు అనుసంధానం చేస్తున్నట్లు తెలిపారు. సచివాలయంలో వ్యవసాయ శాఖ మంత్రిగా కాకాణి గోవర్ధన్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ ఆర్ధిక సంవత్సరంలో రూ.1,395 కోట్ల వ్యయంతో 3.75 లక్షల ఎకరాలకు మైక్రో ఇరిగేషన్ దస్త్రంపై మంత్రి తొలి సంతకం చేశారు. వైఎస్సార్ యంత్ర పథకం కింద రైతులకు 3,500 ట్రాక్టర్లను రైతులకు అందించనున్నారు. ఈ ఫైల్‌పై మంత్రి కాకాణి రెండో సంతకం చేశారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ.43 వేల కోట్లు కేటాయించినట్లు ఆయన వివరించారు.
ఇదీ చదవండి: గ్రాసిమ్ పరిశ్రమలో స్థానికులకు 75 శాతం ఉపాధి - జగన్