ఒక రేషన్ కార్డుకు ఒకటే పింఛన్(pension) విధానాన్ని ప్రభుత్వం పక్కాగా అమలు చేయాలని నిర్ణయించిందని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని నాని(Minister Perni Nani ) తెలిపారు. మంగళవారం ఉదయం తన కార్యాలయం వద్దకు వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలతో మంత్రి సమావేశమయ్యారు. ప్రజల సమస్యలు విని పరిష్కార మార్గాలను చూపారు.
అయ్యా! నా పేరు మదివాడ బాపన రావు(73). మాది వలందపాలెం. ఇటీవల నా వృద్ధాప్య పింఛన్‌ను తొలగించారు. ఎందుకు తొలగించారని సచివాలయ సబ్బందిని ప్రశ్నిస్తే... నా కుమారుడు రేషన్ కార్డులో ఉన్నాడని.. అతడు ఆదాయపన్ను చెల్లిస్తూ... ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న కారణంగా పింఛన్ తొలగించామన్నారు. దీనికి మీరే పరిష్కారం చూపించాలి. - మాదివాడ బాపనరావు, బాధితుడు
మీ అబ్బాయికి ప్రభుత్వ ఉద్యోగం రాగనే రేషన్ కార్డు నుంచి పేరు తొలగిస్తే బాగుండేదని మంత్రి పేర్ని నాని (Minister Perni Nani )అన్నారు. రేషన్ కార్డులో పేరు తొలగించని కారణంగానే పింఛన్ నిలిచిపోయిందన్నారు. రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజలు ఉన్నారని అంచనా ఉంటే... అందులో దాదాపు 4.31 కోట్ల మంది రేషన్ కార్డులో ఉన్నారని, ఆ రేషన్ కార్డులలో అర్హత లేని వారు కూడా ఉన్నట్లుగా అనుమానాలున్నాయన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, సంపన్న వర్గాల వారు, పన్నులు చెల్లించే వారు రేషన్ కార్డులో ఉన్నట్లు అనుమానం రావటంతో ప్రభుత్వం అనర్హుల తొలగించే కార్యక్రమం చేపట్టిందన్నారు. అందులో భాగంగా కొన్ని నిబంధనల్లోనూ ప్రభుత్వం మార్పులు చేసిందన్నారు. గ్రామాల్లో వార్షికాదాయం రూ.1.20లక్షలు, పట్టణాల్లో వార్షికాదాయం రూ.144లక్షలు ఉన్న వారు మాత్రమే రేషన్ కార్డుకు అర్హులని తెలిపారు.
పాత రేషన్ కార్డుదారుల్లో కారు ఉన్నా, ఆదాయపన్ను కడుతున్నా, కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగం ఉన్నా, పింఛన్ తీసుకుంటున్నా వారిని అనర్హులుగా గుర్తించి కార్డును తొలగించారని మంత్రి తెలిపారు. కొత్తగా మంజూరు చేయబోయే రేషన్ కార్డు దరఖాస్తుదారులకు కూడా ఇవే షరతులు వర్తిస్తాయని మంత్రి తెలిపారు.
నా పేరు అంగడాల శరత్ఛంద్ర. నా కుమారుడి పేరు సుందర్. డిగ్రీ చదివి ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నాడు. మీ అబ్బాయికి హోం గార్డు ఉద్యోగం ఇప్పిస్తానని ఓ కానిస్టేబుల్ నా దగ్గర ఏడు సంవత్సరాల క్రితం రూ.80 వేలు తీసుకున్నాడు. ఇప్పటి వరకు ఉద్యోగం ఇప్పించలేదు. తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వమంటే ఇవ్వటం లేదు. మీరే నాకు న్యాయం చేయాలి. - అంగడాల శరత్ఛంద్ర, బాధితుడు
స్పందించిన మంత్రి ఇప్పుడా కానిస్టేబుల్ ఎక్కడ పనిచేస్తున్నడని బాధితుడి ప్రశ్నించాడు. కంచికచర్ల పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నాడని అతడు సమాధానమిచ్చాడు. ఈ సమస్యను తొందర్లోనే పరష్కరిస్తానని బాధితుడికి మంత్రి హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి: తెదేపా ద్విచ్రక్ర వాహన ర్యాలీని అడ్డుకున్న పోలీసులు