కొవిడ్ రోగులకు ఆక్సిజన్ అందించేందుకు ఆర్టీసీ చర్యలు చేపట్టింది. వెన్నెల, స్లీపర్, ఏసీ బస్సుల్లో ఆక్సిజన్ బెడ్లను ఏర్పాటు చేసేందుకు ఏపీఎస్ ఆర్టీసీ నిర్ణయించింది. బెడ్ల కొరత ఉన్న ప్రాంతాల్లో కరోనా రోగులకు బస్సుల్లోనే వైద్యం అందించేందుకు వీటిని అందుబాటులోకి తెస్తున్నట్లు స్ఫష్టం చేసింది.
ప్రయోగాత్మకంగా వెన్నెల బస్సు(Covid buses)లో 10 ఆక్సిజన్ బెడ్లు ఏర్పాటు చేయనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. కోవిడ్ రోగుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులను మంత్రి పేర్ని నాని విజయవాడలో పరిశీలించారు. బస్సుల్లో ఏర్పాట్లు, సదుపాయాలను ఆర్టీసీ ఎండీ మంత్రికి వివరించారు.
ఆసుపత్రి వసతులు లేని చోట్ల బస్సులు...
ఆర్టీసీ తెచ్చిన ఒక్కో స్లీపర్ బస్సులో 10 మంది కొవిడ్ రోగులకు చికిత్స అందిస్తామని పేర్ని నాని తెలిపారు. ఆసుపత్రి వసతులకు దూరంగా ఉండే ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ బస్సులను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇదే సమయంలో బుట్టాయిగూడెం, కె.ఆర్.పురం పీహెచ్‌సీల్లో ఆక్సిజన్ బస్సులు(Covid buses) ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఆస్పత్రులు అందుబాటులో లేని ప్రాంతాల్లో, వైద్య సేవలకోసం సుదూర ప్రాంతాలకు ప్రజలు వెళ్లవలసిన చోట్ల బస్సులను అందుబాటులో ఉంచుతామన్నారు. మెుత్తం 10 ఆర్టీసీ స్లీపర్ బస్సుల్లో ఆక్సిజన్ బెడ్లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని ఆర్టీసీ స్లీపర్ బస్సుల్లో ఆక్సిజన్ బెడ్లు అందుబాటులోకి వస్తాయని మంత్రి స్పష్టం చేశారు.
ఇవీ చదవండి: