తొలిదశ పంచాయతీ ఎన్నికల్లో 38.74% స్థానాల్లో తమ మద్దతుదారులు విజయం సాధించారంటూ చంద్రబాబు అంకెల గారడీ చేస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. ‘ఆంధ్రప్రదేశ్‌లో స్థానాలే చెప్పారా? అసోం రాష్ట్రంలోనివి కూడా కలిపి చెప్పారా? ఎవరైనా వింటే నవ్విపోతారు’ అని ఎద్దేవా చేశారు.
3,244 పంచాయతీల్లో ఎన్నికలు జరగ్గా 2,640 చోట్ల వైకాపా, 509 చోట్ల తెదేపా మద్దతుదారులు గెలుపొందారు. జగన్ నాయకత్వం, పనితీరుకు ఓటర్లు విజయం చేకూర్చారు. ఎన్నికలకు ఎప్పుడూ మేం సిద్ధమే.. కరోనా టీకాల కారణంగా రెండు మూడు నెలలు తర్వాత పెట్టమన్నాం. పురపాలక ఎన్నికలూ ఎన్నికల కమిషన్ ఇష్టం. మా చేతుల్లో లేదు. సుప్రీంకోర్టు నిర్ణయానికి కట్టుబడి.. ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుంది. మంగళవారం నాటి విలేకర్ల సమావేశంలో 91% వైకాపా మద్దతుదారులే గెలిచారు.. ఇంకా రెండుమూడు శాతం పెరుగుతుందన్నా. దానికి భిన్నంగా రెండు మూడు శాతం తగ్గింది. దానికి మేమేం కాదనడం లేదే. మొదటి దశ ఎన్నికల కంటే మిన్నగా..
రెండు, మూడు, నాలుగో దశల్లోనూ విజయాలు వస్తాయని ఆశిస్తున్నా’ అని వివరించారు. ఎమ్మెల్యేలు, వైకాపా మద్దతుదారులైన సర్పంచులతో కూడిన ఫొటోలను త్వరలోవిడుదల చేస్తా మన్నారు. జిల్లాలు, పార్టీల మద్దతుదారులు సర్పంచులుగా గెలిచిన జాబితాను విడుదల చేశారు.
81% పంచాయతీల్లో వైకాపా మద్దతుదారులదే విజయం: సజ్జల
తొలిదశ ఎన్నికలు జరిగిన పంచాయతీల్లో 81% పైగా వైకాపా మద్దతుదారులే విజయం సాధించారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. ఏకగ్రీవాలతో కలిపి 2,640 పంచాయతీల్లో వైకాపా మద్దతుదారులు, 509 చోట్ల తెదేపా మద్దతుదారులు గెలిచారని వివరించారు. 38.74% పంచాయతీల్లో తెదేపా మద్దతుదారులు గెలిచారని చెబుతున్నారని విమర్శించారు. కొన్ని మీడియా సంస్థలు కూడా ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నించాయని విమర్శించారు. బుధవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. తెలుగుదేశం పహిల్వాన్ల నియోజకవర్గాల్లోనూ వైకాపా మద్దతుదారులే అధికశాతం స్థానాలు సాధించారని వివరించారు. టెక్కలిలో మొత్తం 135 స్థానాలకు వైకాపా 112, తెదేపా 23.. తునిలో వైకాపా 54, తెదేపా మూడు, ఇతరులు ఒకటి.. మైలవరంలో వైకాపా 44, తెదేపా మూడు, స్వతంత్రులు ఒక్కరు గెలిచారని తెలిపారు.
ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ అధికార యంత్రాంగాన్ని భయభ్రాంతులకు గురి చేసినా వైకాపాకు రావాల్సిన ఫలితాలు వచ్చాయని చెప్పారు. ఆయన సొంతూరు దుగ్గిరాలలోనూ వైకాపా మద్దతుదారుడైన సర్పంచి 1,160 ఓట్ల మెజార్టీతో గెలిచారన్నారు. ‘తెలుగుదేశం కార్యకర్తలా పనిచేశారు. అపరిమిత అధికారాలున్నాయి, అధికారుల్ని శంకరగిరి మాన్యాలు పట్టిస్తాననే ప్రయత్నం చేశారు. కోర్టును వాడుకున్నారు. ఏకగ్రీవాలు ఎలా జరుగుతాయో చూస్తానన్నారు’ అని ఎస్‌ఈసీని విమర్శించారు. జగన్ తన సోదరికే వెన్నుపోటు పొడిచారంటున్న చంద్రబాబు ఏ రకంగానో కూడా చెబితే బాగుండేదని సజ్జల పేర్కొన్నారు.
ప్రజలు మావైపే: కన్నబాబు
కాకినాడ గ్రామీణం (సర్పవరం జంక్షన్), న్యూస్‌టుడే: మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో 90 శాతం మంది వైకాపా మద్దతుదార్లకే ప్రజలు అండగా నిలిచి వార్ వన్‌సైడ్ చేశారని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు పేర్కొన్నారు. మిగిలిన మూడు విడతల ఎన్నికల్లోనూ ఇవే ఫలితాలు పునరావృతమవుతాయన్నారు.
ఫలితాలపై వైకాపా లెక్క ఇదీ
తొలిదశ పంచాయతీ ఎన్నికల్లో వైకాపా మద్దతుదారులు 2,640చోట్ల (ఏకగ్రీవాలతోకలిపి) విజయం సాధించారని ఆ పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది. తెదేపా మద్దతుదారులకు 509 దక్కగా.. భాజపా/జనసేన మద్దతుదారులు 46 చోట్ల గెలుపొందారని వివరించింది. సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన వారు ఒక్కో స్థానంలో విజయం సాధించారంటూ బుధవారంరాత్రి జాబితా విడుదల చేసింది.
ఇదీ చూడండి: