Yadadri: తెలంగాణలోని యాదాద్రిలో పునర్‌నిర్మితమైన పంచనారసింహుల ప్రధానాలయం భక్తుల దర్శనానికి సిద్ధమైంది. ఈ నెల 28న చినజీయర్‌స్వామి నిర్ణయించిన ముహూర్తం ప్రకారం.. మహాకుంభ సంప్రోక్షణ పర్వం నిర్వహించనున్నారు. ఉదయం 11.55 గంటలకు ఈ క్రతువును నిర్వహించనున్నట్లు యాదాద్రి ఆలయ ఈఓ గీత శనివారం వెల్లడించారు. దీనికి సంబంధించి ఈ నెల 21 అంకురార్పణ మొదలవుతుంది.
సంప్రోక్షణ పూర్తయ్యాక... బాలాలయంలో ప్రతిష్ఠామూర్తులను... ప్రధానాలయంలోకి చేర్చుతారు. ఈ పర్వం పూర్తయ్యాక స్వయంభువుల దర్శనాలకు భక్తులకు అనుమతిస్తామని అధికారులు పేర్కొన్నారు. ఇందుకోసం అధికారులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.
మరోవైపు యాదాద్రిలో శ్రీలక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. స్వర్ణ రథంలో ఆశీనులై బాలాలయం మండపంలో ఊరేగుతూ భక్తులను తన్మయపరిచారు. వేదపారాయణాలు, అర్చకుల మంత్రోచ్ఛారణలు, సన్నాయి మేళాలు, మంగళ వాయిద్యాల హోరులో రథోత్సవ ఘట్టం కన్నుల పండువగా సాగింది. రాత్రి 7 గంటలకు మొదలైన రథోత్సవ మహాఘట్టంలో మొదటగా స్వర్ణ రథానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఛైర్మన్ నర్సింహ మూర్తి, ఈఓ గీత, అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.