కరోనా విస్తృతిని అరికట్టి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి యుద్ధప్రాతిపదికగా చర్యలు తీసుకోవాలని కోరుతూ వామపక్ష పార్టీలు లేఖ రాశాయి. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పెనుమల్లి మధు, సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ, సీపీఐ ఎంఎల్, ఎంసీపీఐ, సీపీఎం ఎంఎల్ లిబరేషన్ పార్టీ నేతలు 11 అంశాలను ఉమ్మడిగా రాసిన లేఖలో ప్రస్తావించారు.
టీకా సరఫరాలో జరుగుతున్న జాప్యాన్ని నివారించేందుకు, దాన్ని ఉచితంగా రాష్ట్రానికి సరఫరా చేసేందుకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని సూచించారు. కరోనా పరీక్షలను విస్తృతంగా చేపట్టాలని.. టెస్టింగ్ కేంద్రాల సంఖ్యను పెంచాలని.. 24 గంటల్లోగా ఫలితాలను అందించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. టెస్టింగు, ట్రేసింగు, ట్రీట్ మెంట్ అనే మూడు అంచెల శాస్త్రీయ పద్ధతిని పునరుద్దరించాలని విజ్ఞప్తి చేశారు. కార్పొరేట్ ఆసుపత్రులలో ఆరోగ్యశ్రీ కేసులను తీసుకోవడం లేదని.. అలాంటి ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులను అత్యవసరంగా కరోనా వైద్యశాలలుగా మార్చాలన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ నుంచి రాష్ట్రంలోని అన్ని ఆసుపత్రులకు ఆక్సిజన్ సరఫరా చేయాలన్నారు. వచ్చే మూడు మాసాల పాటు ప్రతి కుటుంబానికి నెలకు రూ.7500లు సహాయం చేయాలని కోరారు. పది, ఇంటర్‌తో సహా అన్ని రకాల పరీక్షలను వెంటనే వాయిదా వేయాలని కోరారు.
ఇదీ చదవండి