విజయవాడ విద్యుత్ సౌధలో ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు మోపూరు హరిప్రియ(hari priya). ఆమె భర్త రవీంద్ర బాబు కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో ఇంజనీర్‌గా చేసేవారు. వీరిద్దరికి లాయరు కోటు వేసుకోవాలని కోరిక కలిగింది. బలమైన వారి కోరిక ముందు.. వయసుతోపాటు ఏదీ అడ్డుగా నిలవలేకపోయింది. ఇటీవల నిర్వహించిన లాసెట్ పరీక్షను వీరు రాశారు. అయితే.. లాసెట్ ప్రవేశ పరీక్ష(law entrance exam)లో హరిప్రియ సత్తాచాటారు. రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంకు సాధించారు.
విద్యుత్ శాఖలో అసిస్టెంట్ ఇంజనీర్‌గా ఉద్యోగం ప్రారంభించిన ఆమె.. ప్రస్తుతం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా.. గుణదల డివిజన్‌లో సేవలందిస్తున్నారు. ఇక, హరిప్రియ భర్త రవీంద్ర బాబు.. కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో ఇంజనీర్‌గా చేసేవారు. చిన్నతనం నుంచి ఆయనకు న్యాయవిద్యపై ఆసక్తి ఉండడంతో.. గత ఏడాది ఉద్యోగానికి స్వచ్ఛంద పదవీ విరమణ చేసి, ప్రస్తుతం లా చదువుతున్నారు.
యువతకు ఆదర్శంగా ఉండాలనే ఆలోచనతో.. లాసెట్‌కి సన్నద్ధమైనట్లు తెలిపారు. మొదటి ర్యాంకు సాధించిన హరిప్రియ మాట్లాడుతూ.. ఉద్యోగం చేస్తూనే.. ప్రవేశ పరీక్ష కోసం మూడు నుంచి నాలుగు గంటల పాటు చదివినట్టు చెప్పారు. లా పట్టా పొందిన తర్వాత సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నట్లు హరిప్రియ తెలిపారు.
న్యాయశాస్త్రానికి మంచి ఆదరణ ఉందని.. హరిప్రియ భర్త రవీంద్రబాబు చెప్పారు. స్వాతంత్ర్యోద్యమానికి నాయకత్వం వహించి, పోరాటంలో క్రియాశీలపాత్ర పోషించిన ప్రముఖుల్లో.. అధికులు న్యాయ పట్టా పొందిన వారేనని తెలిపారు. చదువుకు వయసు అడ్డురాబోదని.. మనసు కేంద్రీకరిస్తే సునాసాయంగా లక్ష్యాన్ని చేరుకోగలమని ఆయన తెలిపారు. పేదలకు ఉచితంగా న్యాయ సహాయం అందించటంతో పాటు.. వాళ్ల హక్కులను కాపాడటానికీ తమవంతు కృషి చేస్తామని హరిప్రియ దంపతులు చెబుతున్నారు.
ఇదీ చదవండి: