విజయవాడల తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామితో హైకోర్టు సీజేగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఉదయం 10 గంటలకు విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. 19 మంది హైకోర్టు న్యాయమూర్తులు, మంత్రి వెల్లంపల్లి, ప్రజాప్రతినిధులు, న్యాయవాదులు హాజరయ్యారు. ప్రమాణస్వీకారం అనంతరం అతిథులందరూ తేనీటి విందులో పాల్గొన్నారు.
సిక్కిం నుంచి జస్టిస్ గోస్వామి..
1961 మార్చి 11న అసోంలోని జోర్హాట్‌లో జన్మించిన జస్టిస్ గోస్వామి 1985లో గువాహటి ప్రభుత్వ న్యాయకళాశాల నుంచి న్యాయశాస్త్ర పట్టా పొందారు. 1985 ఆగస్టు 16న న్యాయవాదిగా నమోదయ్యారు. సివిల్, క్రిమినల్, రాజ్యాంగం, ఉద్యోగ సేవలకు సంబంధించిన విభిన్న కేసులను వాదించారు. గువాహటి హైకోర్టులో 2011లో అదనపు న్యాయమూర్తిగా, 2012లో శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2019 అక్టోబరు 15న పదోన్నతిపై సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు 2004 డిసెంబరు 21న గువాహటి హైకోర్టు నుంచి సీనియర్ అడ్వొకేట్ హోదా పొందారు. 2011 నుంచి 2013 వరకు నాగాలాండ్ రాష్ట్ర న్యాయసేవా సంస్థ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా వ్యవహరించారు. 2018 నుంచి రెండుసార్లు గువాహటి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించారు. 2019 అక్టోబరు 15న పదోన్నతిపై సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. తాజాగా ఆయనను సిక్కిం నుంచి ఏపి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ చేశారు.
ఇదీ చదవండి:
జర్నలిస్టులకు అక్రెడిటేషన్ కార్డుల జారీపై స్టేటస్ కో: హైకోర్టు