Impact fee: రకరకాల పన్నులతో ప్రజల్ని పీల్చిపిప్పి చేస్తున్న ప్రభుత్వం ఇప్పుడు మరో పిడుగు వేసింది. ఇప్పటికే ఆస్తిపన్ను ఏటా పెంచేస్తూ, కొత్తగా చెత్తపైనా పన్ను వేసి పట్టణ ప్రజలపై మోయలేని భారం మోపిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు... 'ఇంపాక్ట్ ఫీజు' పేరుతో నగర, పట్టణ ప్రజలతో పాటు, వివిధ నగరాభివృద్ధి సంస్థల పరిధిలోకి వచ్చే గ్రామాల ప్రజలపైనా తీవ్ర భారం మోపింది. నగరాలు, పట్టణాలు, నగర పంచాయతీలతో పాటు, ఆయా నగరాభివృద్ధి సంస్థల పరిధిలోకి వచ్చే గ్రామాల్లో 60 అడుగులు, అంతకంటే ఎక్కువ వెడల్పున్న రహదారుల పక్కన కొత్తగా భవనాలు నిర్మించుకునేవారు ప్రస్తుతం అమల్లో ఉన్న లైసెన్స్ ఫీజులు, ఇతర ఛార్జీలకు అదనంగా ఇకపై ‘ఇంపాక్ట్’ ఫీజు కూడా చెల్లించాలని పురపాలకశాఖ గురువారం ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం అమల్లో ఉన్న లైసెన్స్ ఫీజులు, ఇతర ఛార్జీలకు అదనంగా దీన్ని చెల్లించాలని పురపాలక శాఖ ఈ ఉత్తర్వుల్లో పేర్కొంది. మాస్టర్‌ప్లాన్ రోడ్లు, జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు, బైపాస్ రోడ్లు, రింగ్‌రోడ్లను ఆనుకుని పక్కనే ఇళ్లు నిర్మించుకునేవారందరికీ ఫీజు వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఇప్పటికే ఉన్న రహదారులతోపాటు నిర్మాణంలో ఉన్న రహదారులు, కొత్తగా రహదారుల నిర్మాణానికి భూసేకరణ దశలో ఉన్నచోటా ఫీజు కట్టాల్సిందేనని తెలిపింది. 60 అడుగులు, దానికిపైన.. 150 అడుగులలోపు వెడల్పున్న రహదారుల్ని ఆనుకుని నిర్మించే పారిశ్రామికేతర వాణిజ్య భవనాలకూ ఈ ఫీజు వర్తిస్తుంది. 150 అడుగులు, దానికి మించి వెడల్పున్న రహదారులకు రెండు పక్కలా 250 మీటర్ల దూరం వరకు నిర్మించే అన్ని రకాల భవనాలూ ఫీజు కట్టాల్సిందే. రాష్ట్రంలో కొన్నేళ్లలో అనేక కొత్త నగరాభివృద్ధి సంస్థల్ని ఏర్పాటుచేయడంతో పాటు, అప్పటికే ఉన్నవాటి పరిధిని విస్తరించారు. దాంతో మెజారిటీ పల్లెటూళ్లు నగరాభివృద్ధి సంస్థల పరిధిలోకి వచ్చాయి. వాస్తవానికి ఆయా నగరాభివృద్ధి సంస్థలు తమ పరిధిలోకి వచ్చే గ్రామాల్లో చేస్తున్న అభివృద్ధేమీ లేదుగానీ.. ఈ కొత్త విధానం వల్ల ఆయా గ్రామాలవారికి అదనపు వాత మాత్రం పడింది.
వీలైనంత ఎక్కువ లాగేద్దాం..!: 'ఇంపాక్ట్ ఫీజు'ను కూడా ప్రజల నుంచి వీలైనంత ఎక్కువ లాగేసేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. రాష్ట్రంలోని నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీలు, పంచాయతీలను నాలుగు కేటగిరీలుగా విభజించింది. భవనం నిర్మిత ప్రాంతంలో (బిల్టప్ ఏరియా) ప్రతీ చ.అడుగుకు ఇంత మొత్తమని ధర నిర్ణయించింది. ఆ మొత్తాన్నిగానీ.. అక్కడ స్థలం రిజిస్ట్రేషన్ విలువలో 2నుంచి 3శాతంగానీ.. ఆ రెండిటిలో ఏది ఎక్కువైతే దాన్ని వసూలుచేస్తామని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. జాతీయ రహదారులు, మాస్టర్‌ప్లాన్ రోడ్లు, ఇతర ప్రధాన రహదారుల పక్కన భూముల రిజిస్ట్రేషన్ ధరలు ఇప్పటికే మిగతా ప్రాంతాలకంటే ఎక్కువుంటాయి. ఇప్పుడు వాటి ధరలో 3శాతమంటే, అక్కడ ఇళ్లు కట్టుకునేవారికి ఇంపాక్ట్ ఫీజు రూపంలో పడే వాత భారీగా ఉండే అవకాశాలున్నాయి.
వడ్డన ఇలా..!
- ప్రభుత్వం విజయవాడ, గుంటూరు, విశాఖ నగరపాలక సంస్థల్ని ఒక కేటగిరీగా, మిగతా నగరపాలక సంస్థల్ని ఒక కేటగిరీగా, పురపాలక సంఘాలు, నగర పంచాయతీలను ఒక విభాగంగా, నగరాభివృద్ధి సంస్థల పరిధిలోకి వచ్చే పంచాయతీల్ని మరో కేటగిరీగా విభజించింది.
- 60 నుంచి 150 అడుగులలోపు వెడల్పున్న రహదారుల్ని ఆనుకుని నిర్మించే పారిశ్రామికేతర వాణిజ్య భవనాల్లో.. మళ్లీ 500 చ.మీటర్ల లోపు స్థలంలో కడుతున్న భవనాలు, 500 చ.మీ.లకంటే ఎక్కువ విస్తీర్ణమున్న స్థలంలో నిర్మిస్తున్న భవనాలని రెండు కేటగిరీగా చేసి పన్ను విధించింది.
- 150 అడుగులు, దానికంటే ఎక్కువ వెడల్పున్న రహదారులకు పక్కన నిర్మించే భవనాల్లో నివాస భవనాలన్నింటినీ ఒక కేటగిరీలో చేర్చింది. వాణిజ్య భవనాల్ని మళ్లీ స్థలం విస్తీర్ణాన్ని బట్టి 500 చ.మీ.లకు లోపు, దానికిపైన అని రెండు కేటగిరీలు చేసింది.
మోయలేని భారం..! - ప్రస్తుతం పట్టణాలు, నగరాల్లో వాణిజ్య భవనాల నిర్మాణానికి అనుమతులిచ్చేందుకు బిల్డింగ్ లైసెన్సు ఫీజు, బెటర్‌మెంట్ ఫీజు, డెవలప్‌మెంట్ ఛార్జీలు, డ్రైనేజ్, వాటర్‌ఫీజులు, అనుమతుల్లేని లేఅవుట్‌లో చేస్తున్న నిర్మాణాలకైతే అదనంగా 14% ఓపెన్ స్పేస్‌ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా ఇంపాక్ట్ ఫీజు భారీగా పడనుంది.
- ఇతర నగరపాలక సంస్థల పరిధిలో రెండు వేల చ.అడుగుల నిర్మితప్రాంతమున్న వాణిజ్యభవనాన్ని 500 చ.మీ.లకంటే ఎక్కువ విస్తీర్ణమున్న స్థలంలో నిర్మిస్తుంటే.. చ.అడుగుకి రూ.100 చొప్పున రూ.2 లక్షల ఇంపాక్ట్ ఫీజు చెల్లించాలి.
- 500 అడుగులకంటే ఎక్కువ వెడల్పున్న రహదారులకు ఇరువైపులా 250 మీటర్ల వరకున్న ప్రాంతంలో రెండు వేల చ.అడుగుల నిర్మిత ప్రాంతమున్న నివాస భవన నిర్మాణానికి గుంటూరు, విజయవాడ, విశాఖనగరాల్లో రూ.లక్షన్నర ఇంపాక్ట్ ఫీజు చెల్లించాలి.
ఆ డబ్బుతో అభివృద్ధి చేస్తారట..!
- ఇంపాక్ట్ ఫీజు రూపంలో వసూలు చేసిన మొత్తాన్ని ప్రత్యేకమైన ఖాతాలో వేసి రహదారుల విస్తరణ, లింక్‌రోడ్ల నిర్మాణం, జంక్షన్ల అభివృద్ధి, ఫ్లైఓవర్ల నిర్మాణంవంటి మౌలిక వసతుల అభివృద్ధికి ఖర్చు చేయాలని ప్రభుత్వం పేర్కొంది.
- ఫీజును ఆయా నగరాభివృద్ధి సంస్థలు, పట్టణ స్థానిక సంస్థలు సమానంగా పంచుకోవాలని తెలిపింది. నగరాభివృద్ధి సంస్థల పరిధిలోకి రాని పట్టణాలు, నగర పంచాయతీల్లో ఇంపాక్ట్ ఫీజుగా వసూలు చేసిన మొత్తం ఆయా పట్టణ స్థానిక సంస్థలకే వెళుతుందని తెలిపింది.
ఇవీ చూడండి