Bhavani devotees at Kanaka Durga temple: కుండపోత వానలోనూ వారికి భక్తి సడలడం లేదు. దూరబారాలనూ లెక్కచేయడండా వస్తున్నారు. కాలినడకలో గాయాలవుతున్నా పట్టించుకోవడంలేదు. కృష్ణవేణి జలాలతో స్నానం చేయడం.. తడిసిన వస్త్రాలతో దుర్గమ్మను కనులారా దర్శించుకోవడం ఒక్కటే తమదీక్షకు ప్రతిఫలంగా వేలాది మంది భవానీదీక్షదారులు భావిస్తున్నారు.
ఆశ్వయుజమాసం.. దసరా ఉత్సవాల సమయంలో- భవానీదీక్షదారులకు ఎలాంటి ప్రత్యేక ఏర్పాట్లు చేయలేమని దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం ప్రకటించినప్పటికీ- గురుభవానీలు వెనక్కి తగ్గడం లేదు. గత మూడు రోజులుగా ఇంద్రకీలాద్రి అరుణవర్ణంతో కిటకిటలాడుతోంది. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు మహిళలు, పురుషులు అనే తేడా లేకుండా అంతా పరిమిత కాలం దీక్షతో దుర్గామల్లేశ్వరస్వామిని దర్శించుకునేందుకు భారీగా తరలివచ్చారు. కృష్ణానదిలో నీటి ప్రవాహం ఉధృతంగా ఉండడంతో- జల్లు స్నానాలు మినహా నదిలో దిగేందుకు పోలీసులు అనుమతించడంలేదు.
పద్మావతిఘాట్, కృష్ణవేణిఘాట్, భవానీఘాట్ వద్ద ఏర్పాటు చేసిన షవర్ల వద్ద జల్లుస్నానాలు చేసి వినాయక గుడి- కుమ్మరిపాలెం సెంటర్లలోని క్యూలైన్ల నుంచి కొండపైకి చేరుకుంటున్నారు. ఎక్కువ మంది భవానీలు- ఇరుముళ్లతో కాకుండా దీక్షదారులుగానే వస్తున్నారు. ఇరుముళ్లతో వచ్చిన వారు తిరిగి తమ స్వస్థాలలోనే గురుభవానీల వద్ద మాలవిరమణ చేసుకుంటున్నారు. నిన్న, నేడు భవానీమాలదారులతో కొండ కిటకిటలాడుతోంది. రాజరాజేశ్వరి అమ్మవారి అలంకరణలోనే భక్తులకు దుర్గమ్మ దర్శనమిస్తున్నారు. భవానీల కోసం దేవస్థానం అధికారులు- అల్పాహారాన్ని ప్రసాదంగా అందజేస్తున్నారు. నిన్న ఒక్కరోజే సుమారు ఐదు లక్షల వరకు లడ్డు విక్రయాలు జరిగనట్లు ఈవో తెలిపారు.
ఇవీ చదవండి: