గతేడాది జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియలో జరిగిన ఘటనలపై ఫిబ్రవరి 18న ఎస్ఈసీ ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేసిన వ్యాజ్యాల్లో వాదనలు ముగిశాయి. ఇటీవల ఈ వ్యాజ్యాలను విచారించిన ధర్మాసనం... ఏకగ్రీవాన్ని ధ్రువీకరిస్తూ ఫామ్-10 ఇచ్చిన చోట విచారణ జరపొద్దని.. ఇవ్వని చోట ఏదైనా చర్యలు తీసుకునుంటే వాటి వివరాలనూ వెల్లడించొద్దని ఆదేశించింది. కోర్టు.. తాజాగా మరింత లోతైన విచారణను చేపట్టింది. పిటిషనర్ల తరఫున వాదించిన న్యాయవాదులు.. ఈ వ్యవహారాల్లో విచారించే అధికార పరిధి ఎస్ఈసీకి లేదన్నారు. చట్టంలో స్పష్టత లేనప్పుడే తన అధికారాన్ని వినియోగించుకోవచ్చని వాదించారు.
ప్రస్తుత అంశంలో ఫామ్-10 జారీ చేశాక... విచారణ జరపడానికి వీల్లేదన్నారు. ఒక్కటే నామినేషన్ మిగిలినప్పుడు... జాప్యం లేకుండా ఏకగ్రీవాన్ని ప్రకటించాలన్నారు. ఎన్నికల ప్రక్రియలో అక్రమాలు చోటు చేసుకుంటే ఎన్నికల పిటిషన్ ద్వారా ట్రైబునల్లో సవాల్ చేసుకోవాలన్నారు. కొన్ని ఫిర్యాదుల ఆధారంగా విచారణకు కలెక్టర్లను ఆదేశించడం సరికాదని వాదించారు. నిజంగా అడ్డగింతలు, బలవంతపు ఉపసంహరణలు జరిగాయా అన్న అంశంపై పరిశీలకుల నుంచి ఎస్ఈసీ నివేదిక ఎందుకు తెప్పించుకోలేదన్నారు. నామినేషన్ల పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించేందుకు ఎస్ఈసీకి చట్టబద్ధ అధికారం లేదని.. ఆ ఉత్తర్వులను రద్దు చేయాలని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు కోరారు.
బలవంతపు ఉపసంహరణలు , బెదిరిపులు చోటు చేసుకున్నాయా లేదా అన్నది.. వాస్తవాలను పరిశీలించి ఎన్నికల ట్రైబ్యునల్ తేలుస్తుందని ప్రభుత్వం తరపున ఏజీ వాదించారు. ఈ వ్యవహారంలో ఎస్ఈసీ విచారణ జరపలేదన్నారు. మీడియా కథనాల ఆధారంగా విచారణ చేయించడం సరికాదన్నారు. ఎన్నికలను సజావుగా, నిష్పక్షపాతంగా నిర్వహించే అధికారం ఎన్నికల సంఘానికి ఉందని ఎస్ఈసీ తరపు న్యాయవాది అశ్వనీకుమార్ వాదించారు. అనేక ఫిర్యాదులు అందిన నేపథ్యంలో వాటిపై విచారణకు ఆదేశించామన్నారు. విచారణ ప్రారంభ దశలో పిటిషనర్లు కోర్టును ఆశ్రయించడానికి వీల్లేదని.. ఫిర్యాదులపై స్పందించాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్కు ఉందన్నారు.
విచారణ అనంతరం నివేదికలు వస్తేనే ఎన్నికల అధికారులు విధి నిర్వహణలో విఫలమయ్యారా ? లేదా ? తెలుస్తుందన్నారు. అధికరణ 243(కే) ప్రకారం ఫిర్యాదులపై విచారణ చేయించే అధికారం ఎస్ఈసీకి ఉందని... ఫామ్ 10 పొందినవారి నాయబద్ధ హక్కును ప్రశ్నించడం లేదని.. ఏకగ్రీవాలు సజావుగా జరిగాయా లేదా ? అన్న అంశ విశ్లేషణకే విచారణ చేయిస్తున్నామని స్పష్టం చేశారు. ఈ అంశాలని పరిగణనలోకి తీసుకుని వ్యాజ్యాలను కొట్టివేయాలని కోరారు. హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేయాలని మరికొందరు న్యాయవాదులు వాదనలు వినిపించారు.
ఈ ఎన్నికల ప్రక్రియను తాజాగా ప్రారంభించాలంటూ జనసేన వేసిన వ్యాజ్యంపై విచారణ సోమవారానికి వాయిదా పడింది. కరోనా వల్ల నిలిచిన ఎన్నికలను అక్కడి నుంచే ప్రారంభిస్తామంటూ.. ఎన్నికల సంఘం పేర్కొన్న విషయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోలేదని న్యాయమూర్తి గుర్తుచేశారు. అందుకు విరుద్ధంగా తాము ఉత్తర్వులు ఇవ్వలేమని ప్రాథమికంగా అభిప్రాయపడ్డారు.
ఇదీ చూడండి:
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయంపై.. కార్మిక సంఘాల రాస్తారోకో