కొవిడ్ నియంత్రణ కోసం రాష్ట్రంలో కర్ఫ్యూ కొనసాగుతున్న దృష్ట్యా.. బక్రీద్ నిర్వహణకు ఆంక్షలు విధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈద్గాలు, బహిరంగ ప్రదేశాల్లో ఈ నెల 20, 21 తేదీల్లో బక్రీద్ ప్రార్ధనలు నిషేధిస్తున్నట్టు మైనారిటీ సంక్షేమశాఖ ప్రకటించింది. భారీ జన సమూహాలను నివారించేందుకు.. మసీదుల్లో మాత్రమే ప్రార్ధనలకు అనుమతి ఇస్తున్నట్టు పేర్కొంది. భౌతిక దూరం పాటిస్తూ.. మసీదుల్లో 50 శాతం మందికి మాత్రమే ప్రార్ధనలకు అనుమతిస్తున్నట్టు స్పష్టం చేసింది. మాస్కులు లేకుండా.. మసీదుల్లోకి ఎవరినీ అనుమతించవద్దని కమిటీలకు ఆదేశాలు జారీ చేశారు. మసీదు ప్రాంగణాల్లో శానిటైజర్లు, సబ్బులు అందుబాటులో ఉంచాల్సిందిగా కమిటీలకు సూచనలు చేసింది.
వృద్ధులు, పిల్లలు ఇంటి వద్దే ప్రార్ధనలు చేసుకోవాలని సూచించారు. ఈద్ మిలాప్, ముసాఫా, ఆప్తులను కౌగిలించుకోవటం లాంటి కార్యక్రమాలను చేయొద్దని ముస్లిం సోదరులకు ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. మాంసం విక్రయ కేంద్రాల్లోనూ కొవిడ్ నిబంధనలు కఠినంగా అమలయ్యేలా చర్యలు చేపట్టాలని.. జిల్లా కలెక్టర్లు, అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మాంసం విక్రయ కేంద్రాల నుంచి వచ్చే వ్యర్ధాలను.. నదులు, వాగులు, చెరువుల్లో కలపకుండా చూడాలని అధికారులకు ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఇదీ చదవండి:
AP Govt: రాష్ట్ర హక్కులను కేంద్ర గెజిట్ కాపాడుతుంది: జల వనరుల శాఖ