కడప జిల్లా పులివెందులలోని ఏపీకార్ల్‌లో పశువుల వాక్సిన్ తయారీ యూనిట్ నెలకొల్పాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ యూనిట్ నెలకొల్పేందుకు ఐజీవైతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో ఒప్పందంపై ఏపీకార్ల్ సీఈఓ డాక్టర్ ఎం.శ్రీనివాసరావు, ఐజీవై ఇమ్యునోలాజిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రమోటర్ డాక్టర్ ఆదినారాయణరెడ్డి సంతకాలు చేశారు. రాష్ట్ర విభజన తర్వాత పశువులకు అవసరమైన వ్యాక్సిన్ ఉత్పత్తి కేంద్రం లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
2021కి వ్యాక్సిన్ల తయారీ ప్రారంభం..
రాష్ట్రంలో వ్యాక్సిన్ తయారీ కేంద్రాన్ని స్థాపించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేసింది. పీపీపీ విధానంలో ఐజీవైతో పులివెందుల ఏపీకార్ల్‌లో వ్యాక్సిన్ల ఉత్పత్తి కేంద్రం కోసం ఒప్పందం చేసుకున్నారు. 2021 నుంచి వ్యాక్సిన్ల తయారీ ప్రారంభం కానుంది. పశువులకు కావాల్సిన అన్నిరకాల వ్యాక్సిన్లు ఇక్కడ తయారు చేయనున్నారు.
పశువుల్లో వచ్చే గొంతువాపు, జబ్బవాపు, గాలికుంటు వ్యాధి, బ్రూసిల్లా మొదలగు వ్యాధులకు అవసరమైన వ్యాక్సిన్ల తయారీకి ఏర్పాట్లు చేస్తున్నారు. ఐజీవై సంస్థ దాదాపు రూ.50 కోట్ల పెట్టుబడి పెట్టనుండగా..... రాష్ట్ర ప్రభుత్వం సదుపాయాలను అందించనుంది. 100 మంది నిపుణులకు, సిబ్బందికి ఉపాధి లభించనుంది. రాష్ట్ర అవసరాలను తీర్చిన తర్వాత ఇతర రాష్ట్రాలకూ ఎగుమతి చేసే దిశగా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నట్లు సీఎం కార్యాలయం తెలిపింది.
ఇవీ చదవండి: 'ఏయే ప్రాజెక్టులకు ఎంత కేటాయించారో స్పష్టం చేయాలి'