Employee unions round table meeting: పీఆర్సీకి వ్యతిరేకంగా పోరాట కార్యాచరణ ప్రకటించిన ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు.. రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో రౌండ్‌టేబుల్ సమావేశాలు నిర్వహించాయి. విజయవాడ ఎన్జీవో కార్యాలయంలో పీఆర్సీ సాధన సమితి ఆధ్వరాన జరిగిన భేటీలో.. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పింఛనర్ల సంఘం నేతలు సహా పీడీఎఫ్ ఎమ్మెల్సీ లక్ష్మణరావు పాల్గొన్నారు. ఉద్యోగుల పట్ల ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఉమ్మడిగా పోరాడి డిమాండ్లు సాధించుకుంటామని స్పష్టం చేశారు.
జనవరి నెల జీతాలను ప్రాసెస్ చేయబోమని పే అండ్ అకౌంట్ ఉద్యోగుల సంఘం పునరుద్ఘాటించింది. సమ్మెలో ఆర్టీసీ సిబ్బంది కూడా పాల్గొని రవాణా వ్యవస్థను స్తంభింపజేస్తామని.. ఎన్.ఎమ్.యూ రాష్ట్ర కార్యదర్సి సుజాత ప్రకటించారు.
అన్ని జిల్లాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించిన ఉద్యోగ సంఘాలు.. పీఆర్సీపై తీవ్ర నిరసన వ్యక్తంచేశాయి. విశాఖలో జరిగిన యూటీఎఫ్ మహాసభల్లో పాల్గొన్న నేతలు.. పాత పీఆర్సీనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల పట్ల ప్రభుత్వం నిరంకుశ ధోరణితో వ్యవహరిస్తోందని.. కర్నూలు జిల్లా ఉద్యోగుల సంఘాల నాయకులు ఆవేదన వెలిబుచ్చారు. కొత్త పీఆర్సీపై వెనక్కి తగ్గే వరకూ ప్రభుత్వంతో చర్చలకు వెళ్లబోమని.. ఉద్యోగ సంఘాల నేతలు తేల్చిచెబుతున్నారు.
ఇదీ చదవండి: ap employees steering committee: రేపు మధ్యాహ్నం 3 గం.కు సమ్మె నోటీసు ఇవ్వాలని తీర్మానం