MAHARNAVAMI : "జయజయహే మహిషాసురమర్థిని రమ్యకపర్దిని శైలసూతే" అంటూ భక్తులు బెజవాడ కనకదుర్గమ్మను ప్రార్ధిస్తున్నారు. ఆశ్వీయుజ శుద్ధ నవమి రోజున మహిషాసురమర్థినిదేవిగా.. అష్టభుజాలతో సింహవాహినియై.. దుష్టుడైన మహిషాసురుడిని సంహరించిన రూపంలో అమ్మవారు దర్శనమిచ్చారు. లోకకంటకుడైన మహిషాసురిడిని సంహారం చేసిన మహోగ్రరూపం ఇది. సకల దేవతల శక్తులన్నీ ఈమెలో మూర్తీభవించి ఉంటాయనేది భక్తుల నమ్మకం. ఈ రూపంలో అమ్మవారిని దర్శించడం వల్ల సకలపాపాలు హరిస్తాయని భక్తుల విశ్వాసం. సాత్విక భావం ఉదయించి - సర్వదోషాలు పటాపంచలు అవుతాయని.. ధైర్యం, స్థైర్యం, విజయాలు చేకూరుతాయనే భావనతో భక్తులు భగవతిని భక్తితో కొలుస్తున్నారు. తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి అమ్మవారిని భక్తులు దర్శించుకుంటున్నారు. సాధారణ రోజుల్లో కంటే భక్తుల రద్దీ కొంత తక్కువగా ఉన్నా- భవానీల తాకిడి పెరిగింది.
పట్టువస్త్రాలు సమర్పించిన తితిదే ఛైర్మన్ : తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున ఛైర్మన్ వైవీసుబ్బారెడ్డి దంపతులు, తితిదే పండితులు దుర్గమ్మకు పట్టువస్త్రాలు, ఇతర ద్రవ్యాలను సమర్పించారు. ఆలయ ఈవో భ్రమరాంబ, వైదిక కమిటీ సభ్యులు.. దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం తరఫున స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి దర్శనం, పూజ, పండితులతో వేద ఆశీర్వచనం చేయించారు. దసరా ఉత్సవాలు ప్రశాంతంగా సాగేందుకు దేవస్థాన యంత్రాంగం, అధికారులు మంచి ఏర్పాట్లు చేశారని తితిదే ఛైర్మన్ ప్రశంసించారు. దుర్గామల్లేశ్వరస్వామి సన్నిధికి వచ్చే భక్తుల సౌకర్యార్ధం కుమ్మరిపాలెంలోని రెండు ఎకరాల తితిదే స్థలంలో భక్తులకు వసతి సౌకర్యం నిర్మించేందుకు వచ్చే బోర్డు సమావేశంలో ఓ నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఇంద్రకీలాద్రి క్షేత్రపాలకునిగా ఉన్న ఆంజనేయస్వామి ఆలయాన్ని దాతల సహాయంతో అభివృద్ధి చేస్తామని చెప్పారు.
మూడో ఏడాది రద్దైయిన జలవిహారం : దసరా నవరాత్రుల ముగింపు ఉత్సవాల్లో భాగంగా.. విజయదశమి రోజు సాయంత్రం ఆరు గంటలకు పవిత్ర కృష్ణానదిలో తెప్పోత్సవం జరగనుంది. కృష్ణానదిలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడం.. ప్రస్తుతం లక్ష క్యూసెక్కులకు మించి వరద నీరు ప్రకాశం బ్యారేజీకి వచ్చి చేరుతుండడంతో జలవిహారానికి అనుమతి నిరాకరించింది. 20 వేల క్యూసెక్కుల లోపు ఉంటే తప్ప తాము నదిలో ఉత్సవ మూర్తులతో జలవిహారానికి అనుమతించలేమని ఎన్టీఆర్ జిల్లా కలెక్టరు ఢిల్లీరావుకు నివేదిక అందజేశారు. దుర్గాఘాట్ వద్ద నిలిపి ఉంచిన హంసవాహనంపై ఒడ్డునే ఉత్సవ మూర్తులకు పూజలు నిర్వహించేందుకు సమ్మతించారు. ఇందుకు అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
మహర్నవమి రోజున అమ్మవారిని దర్శించుకునేందుకు న్యాయమూర్తులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బందితోపాటు, వివిధ శాఖ ఉన్నతాధికారులు తరలివచ్చారు. మాజీ మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తదితరులు కుటుంబ సమేతంగా అమ్మవారికి పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.
ఇవీ చదవండి:
ఆ వర్గాలకు ఎస్టీ హోదా.. త్వరలోనే రిజర్వేషన్.. అమిత్ షా గుడ్న్యూస్