కనకదుర్గమ్మ దీక్ష చేపట్టిన భవానీలు అమ్మవారిని దర్శించుకుని దీక్ష విరమణ చేసేందుకు తరలివస్తుండడంతో విజయవాడ ఇంద్రకీలాద్రి భక్తులతో కళకళలాడుతోంది. నేటి నుంచి ఐదు రోజుల పాటు భవానీ దీక్షల విరమణ కోసం దుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థానం ఏర్పాట్లు చేసింది. మహామండపం ఎదురుగా నిర్మించిన హోమగుండాల్లో ఉదయం ఆరు గంటల 50 నిమిషాలకు ఆలయ వైదిక కమిటీ ఆధ్వర్యంలో పండితులు అగ్నిప్రతిష్టాపన చేయడంతో భవానీదీక్ష విరమణ మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇరుముడి సమర్పణకు 20 కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఆలయ పాలక మండలి ఛైర్మన్ పైలా సోమినాయుడు, ఈవో సురేష్‌బాబు, ఆలయ స్థానాచార్యులు శివప్రసాదశర్మ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
పిల్లలు, వృద్ధులకు అనుమతి లేదు..
ప్రతి రోజు ఉదయం నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు దీక్ష విరమణ కోసం వచ్చే భక్తుల కోసం దర్శనానికి ఏర్పాట్లు చేశారు. రోజుకు పది వేల మంది భక్తులకు దర్శన అవకాశం కల్పించనున్నారు. ఆన్‌లైన్‌లో ముందస్తుగా టికెట్ బుక్ చేసుకున్న వారినే అనుమతిస్తున్నారు. కొవిడ్ నిబంధనల దృష్ట్యా గిరి ప్రదక్షణ, స్నానఘట్టాలలో స్నానాలు నిషేధించారు. ఆలయ పరిసరాల్లో కేశఖండనకు అవకాశం లేదు. పదేళ్లలోపు పిల్లలు, 60ఏళ్లకు మించిన వృద్ధులకు, దివ్యాంగులకు, గర్భిణులకు దర్శనం నిషేధించారు.
ఇదీ చదవండి: సమాధుల కూల్చివేత పై బాధితుల ఆవేదన