విజయవాడ నగరంలో కొద్దిసేపు వర్షం పడితే చాలు.. ఎక్కడిక్కడ రోడ్లపై నీరు నిలిచిపోతుంది. డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్థంగా మారిపోతుంది. విజయవాడ కమిషనరేట్ పరిధిలో డ్రైనేజీ వ్యవస్థను బాగు చేసేందుకు గతంలో పక్క కాల్వల నిర్మాణం చేపట్టారు. కొన్ని ప్రాంతాల్లో నిర్మాణాలు పూర్తి చేశారు. మరికొన్ని ప్రాంతాల్లో సగంలోనే పనులు ఆపేశారు. దీంతో నగరవాసులు నరకయాతన అనుభవిస్తున్నారు. కాల్వలో నీరు బయటకు వెళ్లే మార్గం లేక మురుగు చేరి దుర్వాసన వస్తుంటుందని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
లయోలా కాలేజీ ఎదురుగా ఉన్న వెంకటేశ్వర నగర్, సిద్దార్ధ కాలేజీ , పటమట ప్రధాన రహదారి, బెంజ్ సర్కిల్ పక్కనే ఉన్న సర్వీస్ రోడ్లపై వర్షం వస్తే నీరు నిలిచిపోతుంది. అదేవిధంగా బస్టాండ్ ఎదురుగా ఉన్న సైడ్ కాల్వలు పొంగి.. వర్షపు నీరు రోడ్డుపైకి వస్తోంది. మున్సిపల్ అధికారులు ప్రతిసారీ ప్రత్యేక వాహనాలు తెచ్చి నీటిని తోడేస్తున్నారే తప్ప.. శాశ్వత పరిష్కారానికి మార్గం చూడట్లేదని అక్కడి వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
శ్రీవెంకటేశ్వర నగర్ కాలనీలో గతంలో డ్రైనేజ్ పనులు చేపట్టారు. అంతా తవ్వేశారు.. పనులు మాత్రం సగమే చేశారు. దీంతో కొందరి ఇళ్లలో నీరు కాల్వలోకి వస్తుంది. కానీ అక్కడ నుంచి వెళ్లే మార్గం అనుసంధానం చేయకపోవటంతో నీరు నిలిచిపోతుందని కాలనీ వాసులు చెబుతున్నారు. మున్సిపల్ అధికారులతో సమస్యలపై మొరపెట్టుకున్నా.. పరిష్కరించడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 796 కరోనా కేసులు.. 11 మంది మృతి