విజయవాడ రాణిగారితోటకు చెందిన దుర్గారావు దివ్యాంగుడు. రోజూ గుంటూరు వెళ్లి చేపలు, రొయ్యలు అమ్ముతుండేవారు. 2018 నుంచి తన సంపాదనలోని కొంత మొత్తంతో ప్రతి గురువారం బెజవాడ శివార్లలోని నిరాశ్రయులు, అనాథలకు అన్నదానం చేస్తుండేవారు. ముగ్గురు ఆడపిల్లులున్నా, దానాల పేరుతో ఇల్లు గుల్ల చేస్తున్నారని కుటుంబసభ్యులు నొచ్చుకున్నా.. సేవా మార్గం వీడలేదు. ఇంట్లోవాళ్ల మనసూ మార్చి వారినీ తన బాటలోకి తెచ్చుకున్నారు. అలా వారానికి ఓసారి క్రమంతప్పకుండా అన్నదానం చేసే దుర్గారావు.. ఇప్పుడు 3 రోజులు పేదలకు ఆహారం అందిస్తున్నారు. లాక్‌డౌన్ కారణంగా తన ఉపాధికి గండిపడినా ఆహార పంపిణీ కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగిస్తున్నారు.
మొదట్లో వారానికి 100 నుంచి 150 మందికి సాయం చేసే దుర్గారావు.. కుటుంబసభ్యులు, స్నేహితుల అండదండలతో ఇప్పుడు 300 మందికి బాసటగా నిలుస్తున్నారు. తనను చూసి సమాజ సేవకు మరికొందరు ముందుకొస్తే అంతే చాలంటున్నారు దుర్గారావు.
ఇదీ చదవండి : 'రాజధానిని తరలించేందుకే కరోనా వివరాలు బయటపెట్టడం లేదు'