భారీ వర్షాలు, వరదల వల్ల ముఖ్యమంత్రి సొంత జిల్లా కడపలో ఎంత మంది చనిపోయారో (Rains Death Toll) ప్రభుత్వం వద్ద కూడా లెక్కలు లేవని మాజీ మంత్రి దేవినేని ఉమ (Devineni uma) ఎద్దేవా చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 6 జిల్లాల్లో లక్షలాది ఎకరాల్లో పంట నష్టపోతే వైకాపా మంత్రులు, ఎమ్మెల్యేలు శాసనసభలో బూతుల పంచాగం ఎత్తుకున్నారని ధ్వజమెత్తారు. వరదలకు కట్టలు తెగి ఊళ్లకు ఊళ్లు మునిగిపోవటానికి ప్రభుత్వ అవినీతే కారణమన్నారు. మంత్రులు బూతుల పంచాంగంలో నిమగ్నమైనందునే.. వరద నష్టాన్ని అంచనా వేయకుండా యంత్రాంగం కళ్లుమూసుకుందని మండిపడ్డారు.
బాబాయి హత్యకేసు చర్చకు రాకుండా సమస్యల్ని పక్కదారి పట్టించేందుకే సభలో వ్యక్తిగత దూషణలకు దిగారని దేవినేని ధ్వజమెత్తారు. సొంత జిల్లానే ముంచేసిన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత లేదన్నారు. మున్సిపల్ ఎన్నికలకు 3 రోజుల ముందే దొంగ ఓటర్లను సిద్ధం చేసిన జగన్..వరదలపై ముందస్తు హెచ్చరికలు జారీ చేయలేకపోయారని ఆరోపించారు.
ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే..
ఆకాల వర్షాల వల్ల రైతులు తమ పంటలు నష్టపోయి తీవ్ర ఆందోళనలో ఉంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అసెంబ్లీలో పొంతనలేని వ్యవహారాలపై చర్చించటం బాధాకరమని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ అన్నారు. భారీ వర్షాల హెచ్చరికను ప్రభుత్వం కంటితుడుపు చర్యగా భావించి నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్నారు. వర్షాల కారణంగా సీఎం సొంత జిల్లా కడపలోనే దాదాపు 50 మంది కొట్టుకుపోయినట్లు తెలిపారు. వర్షానికి డెల్టా ప్రాంతంలోని వరి పైరు నేలమట్టమైందని..,రైతులను ఆదుకునే నాథుడే కరవయ్యాడని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి ఏరియల్ సర్వే ఎందుకు చేశారో అర్థం కాని పరిస్థితి నెలకొందన్నారు. చంద్రబాబుని దుర్భాషలాడటంపై పెట్టిన శ్రద్ధ.. రైతులను ఆదుకోవటంలో చూపడం లేదని విమర్శించారు.
వారందరూ జగన్ సంబంధీకులు కాదా..?
మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారందరూ జగన్ సంబంధీకులు కాదా ? అని ఆలపాటి ప్రశ్నించారు. శివశంకర్ రెడ్డిని సీబీఐ అరెస్టు చేస్తే.. ఎంపీ అవినాశ్ రెడ్డి న్యాయస్థానానికి ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. బాబాయ్ హత్యకు గురైతే స్పందించాల్సిన బాధ్యత జగన్పై లేదా ? అని నిలదీశారు. హత్య విషయాలు బయటకు రాకుండా చంద్రబాబు మీద జగన్ ప్రభుత్వం నీచ రాజకీయాలు చేస్తోందన్నారు. స్పీకర్ పదవికి కళంకం తెచ్చిన ఘనత తమ్మినేనికే దక్కిందని ఆలపాటి రాజేంద్రప్రసాద్ మండిపడ్డారు.
ఇదీ చదవండి