"తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు" అన్న రీతిలో జగన్ ప్రభుత్వం పనిచేస్తోందని తెదేపా నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ ఆరోపించారు. వాళ్ళ అనుచరులకు పోలవరం ప్రాజెక్టు కట్టబెట్టేందుకు పోలవరం పనులు ఆపేశారని దేవినేని విమర్శించారు. విజయవాడలో మీడియా సమావేశంలో వైకాపా ప్రభుత్వంపై మండిపడ్డారు. జగన్ బంధువు పీటర్ తప్పుడు నివేదికలతో మేధావులు, నిపుణులను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. పీటర్ నేతృత్వంలోని నిపుణుల కమిటీ విధానాలను పోలవరం ప్రాజెక్టు అథారిటీ తప్పుపట్టిందని గుర్తు చేశారు.
వైఎస్ హెలీకాప్టర్ కనిపించని సమయంలో పోలవరం పవర్ ప్రాజెక్టు కోసం జగన్ బేరసారాలు చేశారని దేవినేని ఆరోపించారు. కాపర్ డ్యామ్ నిర్మాణం వల్ల ఒక మండలం మునిగిపోయిందని మంత్రి అనటం.. అతని అజ్ఞానానికి నిదర్శనమని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఏపీలో కొన్ని మండలాలు మునిగిపోవటానికి కారణం ఎవరో ఆ మంత్రి సమాధానం చెప్పాలని నిలదీశారు.
టెండర్ల రద్దు ఆషామాషీ వ్యవహారం కాదని పోలవరం అథారిటీ గట్టిగా చెప్పిందని... డ్యామ్ భద్రతకు ఎవరి బాధ్యత అని ప్రశ్నిస్తే ప్రభుత్వం వద్ద సమాధానం లేకుండా పోయిందన్నారు. సీఎం, మంత్రులకు తెదేపాను తిట్టడంతోనే సమయం సరిపోతుందని చెప్పారు. .
గోదావరి నీటిని తెలంగాణకు తీసుకుపోయి కమీషన్లు కొట్టేయడానికి సీఎం కుట్ర పన్నారని ఆరోపించారు. ఎన్నికల్లో సాయం చేశారు కాబట్టి క్విడ్ ప్రోకోగా 450 కిలోమీటర్లకు నీటి తరలింపుపై దృష్టి పెట్టారని దేవినేని మండిపడ్డారు.
ఇదీ చదవండి.. రెవెన్యూ శాఖపై సీఎం ఉన్నత స్థాయి సమీక్ష