NO RUSH: ఈ ఏడాది కూడా సంక్రాంతి వేళ.. వస్త్ర దుకాణాల్లో పండుగ సందడి అంతంత మాత్రంగానే ఉంది. దుకాణాలు వెలవెలబోయి కనిపిస్తున్నాయి. విజయవాడ కేంద్రంగా రాష్ట్రంలోనే పెద్ద హోల్ సెల్ మార్కెట్ ఉంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు ఇక్కడి నుంచే వస్త్రాలు ఎగుమతి అవుతాయి. డిసెంబర్ నెల రెండోవారం నుంచి వ్యాపారాలు ప్రారంభమై.. జనవరి 15 వరకు సాగుతాయి. కొవిడ్ ప్రభావంతో రెండేళ్లుగా వ్యాపారాలు లేక తీవ్ర ఆర్థిక కష్టాల్లో ఉన్న వస్త్ర వ్యాపారులకు ఈసారైనా సంక్రాంతికి గిరాకీ పెరిగుతుందనుకుంటే మళ్లీ నిరాశే మిగిలింది.
వ్యాపారానికి అనువైన సీజన్లలోనే కొవిడ్ దెబ్బ తీవ్రంగా ఉంటోందని వస్త్ర వ్యాపారులు వాపోతున్నారు. ఫలితంగా దుకాణాలు తెరుచుకోలేని పరిస్థితి తలెత్తుతోందని ఆవేదన చెందుతున్నారు. ఈ సారైనా వ్యాపారాలు జరిగి నష్టాల నుంచి గట్టెక్కుదామనుకుంటే.. భిన్నమైన పరిస్థితులు ఎదురయ్యాయంటున్నారు. కరోనా ప్రభావంతో ఆర్థికంగా ప్రతి ఒక్కరూ నష్టపోయారని వ్యాపారులు దీనంగా చెబుతున్నారు.
పెరిగిన నిత్యావసర సరకుల ధరలు, కరోనా కారణంగా ఎప్పుడు ఏమవుందో తెలియని పరిస్థితుల్లో.. ప్రజలు ఆందోళనలో ఉన్నారు. దీంతో పెద్దగా దుస్తులపై ఖర్చుచేసేందుకు మోగ్గుచూపటం లేదని వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు. ఆన్లైన్ వ్యాపారం వచ్చి మరింతగా తమ వ్యాపారాలను దెబ్బతీసిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సంక్రాంతి ఆశలపై నీళ్లు చల్లిన కరోనా.. తర్వాతి పండుగలకైనా వ్యాపారులను కరుణిస్తుందో లేదో చూడాలి.
ఇదీ చదవండి: