New Districts: జిల్లా పునర్విభజన ప్రక్రియలో భాగంగా మౌలిక సదుపాయాల కల్పన చర్యలపై సంబంధిత శాఖల కార్యదర్శులు, కలెక్టర్లు, ఎస్పీలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ సమీక్షించారు. కొత్త జిల్లాలకు ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ల నిర్మాణం, ఆర్డీవో, డీఎస్పీ, ఇతర కార్యాలయాల ఏర్పాటుకు అందుబాటులో ఉన్నభవనాలను గుర్తించి వినియోగించుకునేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని సీఎస్ సూచించారు. వారంలోగా నూతన కలెక్టరేట్లకు వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యంతోపాటు వెబ్ సైట్లనూ అందుబాటులోకి తెస్తామని సీఎస్ చెప్పారు.
కొత్త జిల్లాల్లో సాంకేతిక మౌలిక వసతులకు సంబంధించిన వివరాలను నిర్దేశిత ఫార్మాట్‌లో నమోదు చేసి వెంటనే పంపాలని కలెక్టర్లను ఆదేశించారు. త్వరలోనే సీఎం జగన్ కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, ఇతర అధికారులతో మాట్లాడతారని ఆయన తెలిపారు. రోడ్లు, భవనాల శాఖ నిర్దేశించిన ధరల ప్రకారం అద్దెకు తీసుకునే భవనాలకు రుసుం చెల్లించాలని సీఎస్ ఆదేశించారు. ఐటీ శాఖ అధికారులతో సమన్వయం చేసుకుని ఈ-ఆఫీసు విధానం అమలయ్యేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
మరోవైపు కొత్త జిల్లాల్లో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ ఏర్పాట్లకు అందుబాటులో ఉన్న భవనాలు గుర్తించాలని కలెక్టర్లకు రహదారులు భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు సూచించారు. ఇప్పటికే కొత్త జిల్లాల్లో 17 ఆర్డీవో కార్యాలయాల ఏర్పాటుకు తగిన భవనాలను గుర్తించి వివరాలు పంపారని చెప్పారు. కొత్త కార్యాలయాల్లో ఫర్నీచర్ సమకూర్చుకునేందుకు వివిధ కంపెనీలను సంప్రదించి కొనుగోలు చేయాలని స్పష్టం చేశారు. ఇంటిగ్రేడ్ కలెక్టరేట్ల నిర్మాణానికి అవసరమైన స్థలాలు గుర్తించి.. నిర్మాణ ప్రతిపాదనలు పంపాలని ఈ సందర్భంగా సీఎస్ ఆదేశించారు.
ఇదీ చదవండి
Atchenna on Mining: మావోయిస్టుల లేఖపై వైకాపాది తప్పుడు ప్రచారం: అచ్చెన్నాయుడు